అంతర్జాతీయ స్థాయిలో దేశం తలెత్తుకునేలా చేసిన రెజ్లర్లు.. ఇప్పుడు ఫుట్‌పాత్‌లపై నిద్రపోతున్నారు. తమకు న్యాయం కావాలని పోరుడుతున్నారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై మండిపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దారుణమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని పదవి నుంచి తొలగించాలని ప్రముఖ రెజ్లర్లు నిరసనలు చేశారు.
ఈ విషయంపై వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ కూడా ఇచ్చారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. దీంతో ఆ సమయంలో నిరసన చేపట్టిన రెజ్లర్లు కొంత శాంతించారు. కానీ ఇప్పుడు వారు మరోసారి రోడ్డెక్కాల్సి వచ్చింది. వీళ్లంతా కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసనలకు దిగారు.

బ్రిజ్ భూషణ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసకోవడం లేదని, విచారణలో బయట పడిన విషయాలను వెల్లడించాలని ప్రముఖ రెజ్లర్లు డిమాండ్ చేశారు. తాజాగా ఏడుగురు మహిళా రెజ్లర్లు.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అలాగే మరికొందరు మహిళలు ఇతర ట్రైనర్లపై కూడా ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వ స్పందన చాలా చికాకు కలిగిస్తోందని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ప్రభుత్వ ప్యానెల్ రిపోర్టు ఇంకా బయట పెట్టకపోవడం అసహనం కలిగిస్తోందని సాక్షి అన్నారు. 'మహిళా రిపోర్టర్లు స్టేట్‌మెంట్ తీసుకున్న ప్యానెల్ రిపోర్టు మాకు కావాలి. దాన్ని పబ్లిక్ చేయాలి. ఇది చాలా సున్నితమైన సమస్య. ఈ ఫిర్యాదు చేసిన వారిలో ఒక మైనర్ అమ్మాయి కూడా ఉంది. కాబట్టి ఈ స్టేట్‌మెంట్ ఇచ్చిన అమ్మాయిల పేర్లు బయటకు రాకూడదు' అని ఆమె డిమాండ్ చేసింది.
బ్రిజ్ భూషణ్ అరెస్ట్ అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని, నిరసనలు చేస్తూనే ఉంటామని మరో టాప్ రెజ్లర్ భజరంగ్ పూనియా అన్నారు. తాము ఎంత ప్రయత్నించినా ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి స్పందన కరువైందని మరో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే తింటాం, పడుకుంటాం' అని ఆమె అన్నారు. ఇలా ఫుట్‌పాత్‌పై నిద్రలు పోతున్న రెజ్లర్ల ఫొటోను ట్వీట్ చేసిన ఆమె.. 'పోడియం నుంచి ఫుట్‌పాత్ చేరాం' అని పోస్టు పెట్టింది. ఇది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.