దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలపై క్రీడాశాఖ క్లారిటీ ఇచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పలువుకు ప్రముఖ రెజ్లర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. వీరి గొడవ చాలా పెద్దది అవడంతో దేశవ్యాప్తంగా దీనిపై తెగ చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం రెజ్లర్లతో క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశం అయ్యారు. ఈ నెలాఖరులోగా అంటే జూన్ 30లోగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రెజ్లర్లకు అనురాగ్ ఠాకూర్ మాటిచ్చారు. అదే సమయంలో మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ సింగ్ అనుయాయులు, సన్నిహితులు ఎవరూ ఈ ఎన్నికల్లో నిలబడకుండా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.

అయితే ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక సమావేశం జరగాల్సి ఉంది. లేదంటే వార్షిక సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వార్షిక సమావేశానికి ఇంకా చాలా టైం ఉండటంతో ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. కానీ నిబంధనల ప్రకారం ఈ సమావేశం ఏర్పాటు చేయాలంటే 21 రోజుల్లోపు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడే డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు నిర్వహించలేం.
ఈ క్రమంలోనే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిటికీ కుదిరేలా వచ్చే నెల 4వ తేదీన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జమ్మూకాశ్మీర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ మహేష్ మిట్టల్ కుమార్‌ను నియమించింది. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఎన్నికలు జరుగాయని సమాచారం.
డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీని నిర్ణయించే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఐఓఏపై ఉందని, అందుకే మిట్టల్ కుమార్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తున్నట్లు ఒలింపిక్ సంఘం సీఈవో కల్యాణ్ చౌబే ఒక లేఖ రాశారు. అయితే ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం తీసుకునేది మాత్రం మిట్టల్ కుమార్ అని తెలుస్తోంది. ప్రత్యేక సమావేశం ఎప్పుడు నిర్ణయించాలో కూడా ఆయనే డెసిషన్ తీసుకుంటారు. దీన్నిబట్టి చూస్తుంటే ఎన్నికలు మరింత ఆలస్యమైనా అవ్వొచ్చని నిపుణులు అంటున్నారు.