
హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఘనత సాధించింది. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారత అథ్లెట్‌గా వినేశ్ ఫొగాట్ నిలిచింది. మొనాకోలో ఫిబ్రవరి 18న ప్రకటించే ఈ అవార్డుల్లో గొప్పగా పునరాగమనం చేసిన క్రీడాకారుల జాబితాలో వినేశ్ పేరు ఉంది.
ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయిన భారత తొలి క్రీడాకారిణి వినేశే కావడం విశేషం. రియో ఒలింపిక్స్‌లో గాయపడిన తర్వాత కామన్వెల్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచి తన పునరాగమనాన్ని వినేశ్ ఫోగాట్ గొప్పగా చాటిన సంగతి తెలిసిందే. దిగ్గజ గోల్ఫర్ టైగర్ వుడ్స్ కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు.
చివరిగా 2004లో భారత క్రికెట్ జట్టుకు లారెస్ అవార్డు వచ్చింది. ఇరు దేశాల మధ్య పొలిటికల్ టెన్షన్ ఉన్నప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నందుకు గాను భారత, పాకిస్థాన్ క్రికెట్ జట్లకు సంయుక్తంగా లారెస్ అవార్డు వరించింది.