
న్యూఢిల్లీ: మల్లయోధుడు సాగర్ రానా హత్య కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తాజాగా మరో డిమాండ్ చేశాడు. ఇటీవల తనకు సెల్‌లో ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాలని కోరిన సుశీల్.. ఇప్పుడు ఓ టీవీ పెట్టించాలని జైలు అధికారులను అడుగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్‌కు సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నట్లు అతడు అనడం విశేషం. ఈ మేరకు జైలు అధికారులకు సుశీల్ కుమార్ ఓ లేఖ రాశాడు.
రెండు సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన సుశీల్ కుమార్.. రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం అత్యధిక భద్రత ఉండే తీహార్‌లోని జైల్ నంబర్ 2లో అతడు ఉంటున్నాడు. సుశీల్ కుమార్‌కు జైలు నిబంధనల ప్రకారం.. న్యూస్ పేపర్స్ మాత్రం ఇస్తున్నారు. ఇంతకుముందు అతడు ప్రత్యేక ఆహారం (ప్రొటీన్ మిల్క్‌షేక్, బలాన్నిచ్చే కొన్ని మాత్రలతో పాటు వ్యాయామ పరికరాలు) కావాలని వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అవి అంతగా అవసరం లేదంటూ కోర్టు అతని డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరి టీవీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న యువ రెజ్లర్ సాగర్ రాణాతో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్‌పై సుశీల్ కుమార్ మరియు అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తీవ్ర గాయాలైన సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి అనంతరం పరారీలో ఉన్న సుశీల్ కుమార్‌తో పాటు సహ నిందితుడు అజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఓ ఫ్లాట్ విషయంలోని గొడవ ఈ హత్యకు దారితీసిందని పోలీసుల విచారణలో తేలింది.
హత్య కేసు ఆరోపణలతో సుశీల్ కుమార్ సెంట్రల్ కాంట్రాక్టును భారత రెజ్లింగ్ సమాఖ్య రద్దు చేసింది. సుశీల్‌తో పాటు పూజా ధండాను కాంట్రాక్టు నుంచి తప్పించారు. వీరిద్దరికీ 2019లో సెంట్రల్ కాంట్రాక్టులు దక్కాయి. అనంతరం వీరు ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. సుశీల్‌ను భారతీయ రైల్వే శాఖ కూడా సస్పెండ్ చేసింది. మరో ప్రకటన చేసేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. నార్తర్న్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా అతడు పనిచేస్తున్నాడు.