
హైదరాబాద్: భారత్‌కు వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలను అందించిన రెజ్లర్ సుశీల్ కుమార్ తనకు స్ఫూర్తి అనిరియో ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ పేర్కొంది. ఇండోర్ వేదికగా ముగిసిన జాతీయ సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మాలిక్ స్వర్ణ పతకం సాధించిన సంగత తెలిసిందే.
ఈ నేపథ్యంలో సాక్షి మాట్లాడుతూ 'బీజింగ్ ఒలింపిక్స్-2008, లండన్ ఒలింపిక్స్-2012లో భారత్‌కు వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు అందించిన సుశీల్ కుమార్ నాకు స్ఫూర్తి. ఇప్పటికి నేను ఒక ఒలింపిక్ పతకాన్ని గెలిచాను. అతనిలా వరుసగా రెండోది కూడా గెలిచి రికార్డు సృష్టించాలి' అని తెలిపింది.
'2020 టోక్యో ఒలింపిక్స్‌లో అది సాధించాలి. ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. ప్రాక్టీస్ చేస్తున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి నా పతకం రంగు తప్పక మార్చుకుంటాను. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో ఎవరికైనా ఒత్తిడి ఉండటం సహజం' అని సాక్షి తెలిపింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్ కాంస్యం నెగ్గింది.
'సీనియర్ ఆటగాళ్లు సైతం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలి. అప్పుడే గేమ్‌కు దగ్గరవుతాం. తద్వారా అంతర్జాతీయ పోటీల్లో రాణించగలుగుతాం. నేను చిన్నా, పెద్దా అని పోటీలను చూడను. అన్నింట్లోనూ పాల్గొంటాను. ఎందుకంటే నేను రెజ్లింగ్‌కు దూరంగా ఉండలేను' అని సాక్షి మాలిక్ తెలిపింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.