
హైదరాబాద్: భారత మహిళా రెజ్లర్ రీతూ ఫొగట్‌ను టార్గెట్ ఒలింపిక్స్ పోడియం పథకం (టాప్స్) నుంచి భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తప్పించింది. గతేడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గిన రీతూ ఫోగాట్ ఇటీవల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు మారింది.
టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్‌కు తాను అందుబాటులో ఉండనని మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలిపింది. దీంతో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ను తన కెరీర్‌గా ఎంచుకోవడంతో ఆమె పేరును టాప్స్ నుంచి తొలగిస్తున్నట్టు భారత క్రీడాప్రాథికార సంస్థ (సాయ్) వెల్లడించింది.
"ఇంతకుముందు టాప్స్ జాబితాలో చేర్చిన రీతూ ఫొగట్ పేరును ఇప్పుడు తొలగిస్తున్నాం. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం సింగపూర్‌లో శిక్షణకు వెళుతున్నట్టు ఆమె ప్రకటించింది. దీంతో ఆమెకు ఇక టాప్స్‌లో చోటు లేదు" అని సాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒలింపిక్స్ పతకాల లక్ష్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 'టాప్స్'ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ 'టాప్స్' ద్వారా క్రీడాకారులకు ఆర్థికంగా అండదండలు అందిస్తోంది. అలాంటిది ఒలింపిక్స్‌లో ఆడని క్రీడాకారులను అందులో ఉంచడం తగదని భావించిన 'సాయ్' వెంటనే రీతు ఫొగాట్‌ను టాప్స్ నుంచి తప్పించింది.