
నిమిషాల్లోనే ఫినిష్..
2019లో వివాదాస్పదంగా తనపై సాధించిన విజయానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు బజరంగ్. ఏ దశలోనూ తన ప్రత్యర్థిని పైచేయి సాధించడానికి అవకాశం ఇవ్వలేదు. ఆటమొదలైన నిమిషాల్లోనే తన వశం చేసుకున్నాడు. కాంస్య పతకానికి సాగించిన పోరులో బజరంగ్ రెండు విజయాలు, ఒక ఓటమిని ఎదుర్కొన్నాడు. తొలుత- పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 1/8 ఫైనల్ రౌండ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. కిర్గిజిస్తాన్‌కు చెందిన ఎర్నజార్బ్ అకమటలియేవ్‌పై తిరుగులేని విజయాన్ని ఆర్జించాడు. ఈ విజయంతో ఆయన క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

క్వార్టర్స్‌లో గ్రాండ్ విక్టరీ..
క్వార్టర్ ఫైనల్స్‌లో బజరంగ్ పునియా..తన ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు. ఇరాన్‌కు చెందిన కుస్తీ వీరుడు మోర్తెజా హసన్ అలీ ఛెకా ఘియాసీనీ ఓడించాడు. మోర్తెజా ఘియాసీకి ఇదే తొలి ఒలింపిక్స్. అతణ్ని ఓడించి పునియా సెమీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు కనిపించింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో తడబడ్డాడు. ఫలితంగా బౌట్ చేజారింది. ఆ బౌట్‌లో అజర్‌బైజాన్‌కు చెందిన హాజీ అలియేవ్ చేతిలో పరాజయాన్ని చవి చూశాడు. 12-5 తేడాతో ఆ బౌట్‌ను కోల్పోయాడు. దీనితో ఫైనల్స్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయాడు.

కాంస్యం పోరులో సత్తా..
ఆ ఓటమితో ఏ మాత్రం నిరాశ చెందలేదు.. నిరుత్సాహ పడలేదు బజరంగ్. కాంస్య పతకాన్ని సాధించాలనే అతని తపన ముందు ఏవీ అడ్డు నిలవలేకపోయాయి.. చివరికి ప్రత్యర్థి కూడా. నిజానికి- హాజీ అలయేవ్‌తో జరిగిన బౌట్ సందర్భంగా బజరంగ్ మోకాలికి గాయమైంది. మోకాలి నొప్పితోనే బాధపడుతూ కాంస్యం పోరుకు సమాయాత్తమయ్యాడు. ఈ ఉదయం అతను తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడాడు. మోకాలికి గాయమైన విషయాన్ని వివరించాడు. ఈ సందర్భంగా అతని తండ్రి బల్వాన్ సింగ్.. తన కుమారుడికి ధైర్యాన్ని నూరిపోశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బౌట్‌ను కోల్పోవద్దంటూ సూచించారు. పతకంతో స్వదేశానికి తిరిగి రావాలని అభిలాషించారు. కోట్లాది మంది భారతీయుల ఆశలను నిలబెట్టాలంటూ స్ఫూర్తి నింపారు.

ఏకపక్షంగా విక్టరీ..
కొద్దిసేపటి కిందటే ముగిసిన కాంస్య పతకం కోసం సాగించిన పోరులో కజకిస్తాన్‌కు చెందిన దౌలెట్ నియాజ్‌బెకోవ్‌పై ఏకపక్షంగా విజయాన్ని సాదించాడు బజరంగ్ పునియా. 8-0తో అతను బౌట్ గెలిచాడంటే.. ఏ స్థాయిలో చెలరేగిపోయి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యంత వివాదాస్పద రీతిలో దౌలెట్ నియాజ్‌బెకోవ్.. బజరంగ్ పునియాపై విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 9-9 స్కోర్ సమంగా ఉన్న సమయంలో 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో దౌలెట్ గెలిచినట్లు ప్రకటించారు నిర్వాహకులు. దానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టయింది.. బజరంగ్‌కు.

దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు..
ఈ బౌట్‌లో బజరంగ్ పునియా సాధించిన ఘన విజయాల పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యువజన వ్యవహారాలు-క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్, ఆ శాఖ సహాయమంత్రి నితీష్ ప్రామాణిక్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వంటి పలువురు ప్రముఖులు అతణ్ని అభినందనలతో ముంచెత్తుతోన్నారు. బజరంగి సాధించిన ఈ విజయం పట్ల అతని స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బాణాసంచా కాలుస్తూ..స్వీట్లు పంచిపెడుతోన్నారు అభిమానులు. అతని కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాలు నింగిని అంటాయి.


Click it and Unblock the Notifications
