
న్యూఢిల్లీ: కరోనా సృష్టిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదాపై క్రీడాకారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వాయిదా నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేసింది. చివరకు తాము భయపడిందే జరిగిందని వినేశ్ పేర్కొంది. ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడడం తీవ్ర నిరాశను కలిగించిందని ఫొగాట్ చెప్పింది.
'ఐవోసీ తాజా నిర్ణయంతో నిరాశ చెందా. ఒలింపిక్స్ వాయిదా వేస్తారేమో అని ముందు నుంచి భయపడుతూ వచ్చా. చివరకు అదే జరిగింది. ప్రతి ఒక్క అథ్లెట్ భయపడిందే నిజమైంది. ఒలింపిక్స్‌లో పోటీపడడం చాలా కఠినమైన పరీక్ష. కానీ.. ఆ పోటీపడే అవకాశం కోసం సుదీర్ఘ కాలం వేచి చూడడం ఇంకా కష్టం. ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడడంపై ఎలా స్పందించాలో కూడా తెలియట్లేదు' అని వినేశ్ ఫొగాట్ అంది.
'క్రీడాకారులకే కాదు ప్రపంచానికి ఇదో క్లిష్ట సమయం. ఏదేమైనా ఒలింపిక్స్ వాయిదా తీవ్ర నిరాశను కలిగించింది. అందరూ ధైర్యంగా ఉండి ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు పోరాడాలి. లక్ష్యంపై తిరిగి దృష్టి సారించాలి' అని 25 ఏళ్ల వినేశ్ చెప్పింది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన వినేశ్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
రియో (2016)లో కచ్చితంగా పతకం సాధిస్తుందనే అంచనాలతో బరిలో దిగిన వినేశ్ గాయం కారణంగా అర్ధాంతరంగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్న స్టార్ రెజ్లర్ గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. క్రితంసారి దక్కని పతకాన్ని ఈసారైన ముద్దాడాలనుకుంటే.. ఐవోసీ నిర్ణయం ఆమె ఆశలను వాయిదా వేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించాలని మనో ధైర్యంతో ముందుకుసాగాలని ఫొగాట్ పేర్కొంది.