
హైదరాబాద్: ప్యాంగ్ చాంగ్ వేదికగా జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్ తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగినా ఎవరికీ పెను ప్రమాదాలు మాత్రం జరగలేదు. అయితే, బుధవారం జరిగిన స్కై క్రాస్ హీట్స్ ఈవెంట్ మాత్రం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
ఈ ఈవెంట్‌లో పాల్గొన్న 35 ఏళ్ల ఫ్రీ స్టైల్ స్కైయర్ డెల్ బోస్కో భయంకరమైన ప్రమాదానికి గురయ్యాడు. డెల్ బోస్కో గాల్లో బ్యాక్-ఫ్లిప్ చేసే చేసే క్రమంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. దీంతో భూమికి 30 మీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందపడ్డాడు. ఈ ఈవెంట్‌ను చూస్తున్న ప్రేక్షుకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అక్కడికి చేరుకున్న మెడికల్ సిబ్బంది డెల్ బోస్కోని స్ట్రైచర్‌పై చికిత్స కోసం తీసుకెళ్లారు. అంత ఎత్తునుంచి పడటంతో డెల్ బోస్కో కుడి తుంటి విరిగినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు పొత్తికడుపు నొప్పితో కూడా బాధపడుతున్నట్లు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.
గాయం తీవ్రత తెలుసుకునేందుకు మరిన్ని టెస్టులు చేయాల్సి ఉందని తెలిపారు. అమెరికా సంతతికి చెందిన డెల్ బోస్కో వింటర్ ఒలింపిక్స్‌లో కెనడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వింటర్ ఒలింపిక్స్‌లో డెల్ బోస్కో పాల్గొనడం ఇది మూడోసారి. అంతకముందు 2010లో వాంకోవర్, 2014లో సోచీ, ఇప్పుడు ప్యాంగ్ చాంగ్‌లో పాల్గొన్నాడు.