For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌ ఖాతాలో రెండో పతకం.. అమిత్‌ ఖత్రీకి రజతం! అద్భుతమే చేసినా..!

World U-20 Athletics Championship: Amit Khatri wins silver medal in 10km race walk

నైరోబి: ప్రపంచ జూనియర్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో రెండో పతకం చేరింది. 10000 మీటర్ల నడకలో భారత అథ్లెట్‌ అమిత్‌ ఖత్రి రజత పతకం కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన రేసులో 17 ఏళ్ల అమిత్‌ 42 నిమిషాల 17.94 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. కెన్యా అథ్లెట్‌ హెరిస్టోన్‌ వన్యోని (42:10.84 సె) స్వర్ణం పతకం ఖాతాలో వేసుకున్నాడు. స్పెయిన్‌ అథ్లెట్‌ పాల్‌ మెక్‌గ్రాత్‌ (-42:26.11 సె) కాంస్యం గెలిచాడు. అమిత్‌ రేసులో 9 వేల మీటర్ల మార్కు వద్ద అందరికంటే ముందంజలో ఉన్నాడు. అయితే చివరకు స్థానిక అథ్లెట్‌ వన్యోని అమిత్‌ను అధిగమించి స్వర్ణం ఎగరేసుకుపోయాడు.

రోహ్‌తక్‌కు చెందిన 17 ఏళ్ల అమిత్‌ ఖత్రి పాల్గొన్న తొలి అంతర్జాతీయ ఈవెంట్‌ అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్పే. ఈ జనవరిలో 40:40.97 సెకన్ల టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పాడు. శనివారం ఆ టైమింగ్‌ను అతను అందుకుని ఉంటే స్వర్ణం సొంతమయ్యేది. అయితే సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండే నైరోబిలో వాతావరణం అమిత్‌ ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపింది. కెన్యా రాజధాని నైరోబి సముద్ర మట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంటుంది. ఇది భారతీయులకు ప్రతికూల ప్రదేశం. ఇలాంటి చోట భారత అథ్లెట్‌ సుదీర్ఘ పరుగులో స్వర్ణానికి చేరువగా వెళ్లడం ఆషామాషీ విషయం కాదు.

రేసులో వేగంగా దూసుకెళ్లిన అమిత్‌ ఖత్రి 8 ల్యాపులు ముగిసే సరికి అందరికంటే ముందున్నాడు. దాదాపు 9000 మీటర్ల దాకా ఇదే వేగం నమోదు చేయగా.. స్థానిక అథ్లెట్‌ వాన్యోని అనూహ్యంగా ఆఖరి ల్యాపులో ఖత్రీని అధిగమించాడు. సొంతగడ్డపై జరిగిన అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో వన్యోని స్వర్ణం గెలవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే రేసులో చివరి దశ వరకు అమిత్‌.. వన్యోనిని వెనక్కి నెట్టగలగడం, మిగతా దేశాల అథ్లెట్లందరినీ అధిగమించి రజతం సాధించడం గొప్ప ఘనతే అని చెప్పాలి.

పరుగు ముగిసిన అనంతరం అమిత్‌ ఖత్రీ మాట్లాడుతూ... 'నేను ఆశించిన ఫలితం ఇది కాదు. స్వర్ణం నెగ్గాలనే లక్ష్యంతోనే ఇక్కడికి వచ్చాను. కొంత నిరాశగానే ఉన్నా.. రజతంతో సంతృప్తిగానే ఉన్నా. ఇంత ఎత్తులో పోటీలు జరగడం కూడా నాపై ప్రభావం తీవ్ర చూపింది. రేస్‌ సందర్భంగా కొన్నిసార్లు ఊపిరాడనట్లు అనిపించింది. అయినా దాన్ని లెక్కచేయకుండా గమ్యాన్ని చేరా. భవిష్యత్తులోనూ నిలకడైన ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా. నాకు సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు.

ఇక మహిళల 400 మీటర్ల పరుగులో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రియా మోహన్‌కు నిరాశే ఎదురైంది. ఫైనల్‌ పోటీని ప్రియ 52.77 సెకన్లలో ముగించి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో ఇమావోబంగ్‌ (నైజీరియా; 51.55 సె.), కార్నెలియా (పోలండ్‌; 51.97 సె.), కెన్యా అథ్లెట్‌ సిల్వియా చెలన్‌గట్‌ (52.23 సె.) పతకాలు గెలిచారు. ఇక పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో రోహన్‌ గౌతమ్‌ కాంబ్లి ఫైనల్‌ చేరడంలో విఫలమయ్యాడు. సెమీస్‌లో అతను 52.88 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల హీట్స్‌లో అబ్దుల్‌ రజాక్, సుమిత్‌ చహల్, కపిల్, భరత్‌ శ్రీధర్‌లతో కూడిన జట్టు హీట్స్‌తోనే సరిపెట్టుకుంది.

Story first published: Sunday, August 22, 2021, 7:29 [IST]
Other articles published on Aug 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+