సిడ్నీ/మెల్బోర్న్: సెమీ ఫైనల్ కోసం భారత్ - ఆస్ట్రేలియా జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. భారత్‌ను ఢీకొనేందుకు ఆస్ట్రేలియాకు మాజీ ఆటగాడు షేన్ వార్న్ స్పిన్ మెళకువలు నేర్పుతున్నాడు. నెట్స్‌లో ఆస్ట్రేలియా జట్టు చెమటోడుస్తోంది.
కెప్టెన్ మైకెల్ క్లార్క్ సహా ఆస్ట్రేలియా జట్టు అంతా చెమటోడుస్తోంది. సిడ్నీ స్పిన్‌కు అనుకూలమనే వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాకు స్పిన్ బలం అంతగా లేదు. భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడెజాలు ఉన్నారు. వారిని ఢీకొనేందుకు ఆసిస్ బ్యాట్స్‌మెన్ షేర్న్ వార్న్‌తో పాఠాలు చెప్పించుకుంటున్నారు.
ఇదీ షేర్న్ వార్న్ రికార్డ్
సిడ్నీ క్రికెట్ మైదానంలో 14 టెస్టులు ఆడిన షేర్న్ వార్న్ 64 వికెట్లు తీశాడు. 26 వన్డేలు ఆడిన వార్న్ 43 వికెట్లు తీశాడు. ఇది వార్న్‌కు ఇష్టమైన మైదానాల్లో ఒకటి. ఇదే స్టేడియంలో వార్న్ 23 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు.

చెమటోడుస్తున్న భారత్
మరోవైపు భారత జట్టు కూడా నెట్లో చెమటోడుస్తోంది. కాగా, భారత్‌ను స్లెడ్జింగ్‌తో దెబ్బతీయాలని ఆసిస్ భావిస్తోంది. ఇప్పటికే మిచెల్ జాన్సన్ మాట్లాడుతూ.. డేవిడ్ వార్నర్ వెనక్కి తగ్గితే తాను నోరు చేసుకుంటానని చెప్పాడు. టెస్ట్ సిరీస్ సందర్భంగా డేవిడ్ వార్నర్ భారత ఆటగాళ్లపై దూషణలకు దిగి శిక్షను కూడా అనుభవించాడు.
తాను దూషణలకు దూరంగా ఉంటానని డేవిడ్ వార్నర్ అన్నట్లు తాను విన్నానని, అయితే ఆ పని ఎవరో ఒకరు చేయాలని, తాను ఆ పనిచేస్తానని, అది కూడా ఆటలో భాగమని అన్నాడు. అది వినోదాన్ని పంచే విషయమని, ఈ ఆటలో దాన్ని చూడబోతున్నారని ఆయన అన్నాడు. స్లెడ్జింగ్‌తో కూడా భారత్‌ను దెబ్బతీయాలని ఆసిస్ భావిస్తోందని అంటారు. అయితే, దానికి కోహ్లీ లాంటి వాళ్లు ధీటుగా సమాధానం చెబుతారా అనేది చూడాలి.
స్లెడ్జింగ్ ఎదుర్కొంటాం: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా స్లెడ్జింగ్‌ను తాము ధీటుగా ఎదుర్కొంటామని రోహిత్ శర్మ అన్నాడు. కాగా, సిడ్నీ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు 70 శాతం మంది భారత అభిమానులే టిక్కెట్లు కొన్నారు.