న్యూఢిల్లీ: ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికాపై టీమిండియా రికార్డు పేలవంగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి 22న సఫారీలతో జరిగే పోరులో భారత జట్టు విజయం సాధించడం ఖాయమని హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అద్భుత విజయంతో ఈసారి ప్రపంచ కప్ టోర్నీలో శుభారంభం సాధించిన భారత జట్టులో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగిందని అన్నాడు.
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో అలరారుతున్న భారత జట్టు ఇదే ఊపుతో డేల్ స్టెయిన్ సేనను కూడా చిత్తు చేయగలుగుతుందని లక్ష్మణ్ అన్నాడు. 'ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు టీమిండియాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ ప్రస్తుతం భారత బ్యాట్స్‌మన్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో వారు పాకిస్తాన్‌పై ప్రదర్శించిన ఆటతీరు ప్రోత్సాహకరంగా ఉంది' అని తెలిపాడు.

'ప్రపంచ కప్ టోర్నీకి దాదాపు రెండున్నర నెలల ముందు నుంచే ఆస్ట్రేలియాలో ఉన్న భారత జట్టు అక్కడి వాతావరణ పరిస్థితులను ఆకళింపు చేసుకుని బౌన్సీ పిచ్‌లపై వేగంగా వికెట్లు సాధించడం ఎలాగో తెలుసుకున్నారు. పాకిస్తాన్‌పై సాధించిన అద్భుత విజయమే ఇందుకు నిదర్శనం. డేల్ స్టెయిన్, మోర్న్ మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్ లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా జట్టును ఢీకొనడం టీమిండియాకు సవాలే అయినప్పటికీ ప్రపంచంలోని ఎటువంటి బౌలింగ్ లైనప్‌నైనా తుత్తునియలు చేయగల సామర్ధ్యం భారత బ్యాటింగ్ విభాగానికి ఉంది' అని లక్ష్మణ్ మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.
ప్రస్తుత ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో పాక్‌పై సాధించిన విజయం భారత బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని తారాస్థాయికి చేర్చిందని, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫిబ్రవరి 22వ తేదీన దక్షిణాఫ్రికాతో తలపడే భారత జట్టుకు ఇది కచ్చితంగా ఉపకరిస్తుందని లక్ష్మణ్ అన్నాడు.