యువ కెరటం దొమ్మరాజు గుకేశ్.. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టైటిల్‌తో పాటు కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీని కూడా గుకేశ్ దక్కించుకున్నాడు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, చెస్ వరల్డ్ చాంఫియన్‌గా నిలిచి గుకేశ్ అందుకున్న ప్రైజ్ మనీ.. అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం కన్నా రెండు రెట్లు ఎక్కువ అని తెలిసింది.
చెస్.కామ్.... గుకేశ్ కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర నివేదికను వెల్లడించింది. ఇందులోనే గుకేశ్ అందుకున్న ప్రైజ్ మనీ వివరాలను తెలిపింది. 2024లో అతడు మొత్తంగా ఎంత సంపాదించాడో వెల్లడించింది. గుకేశ్ రూ.13.6 కోట్ల ప్రైజ్ మనీని అందుకున్నాడు. అలానే తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఈ మొత్తం యూఎస్ ప్రెసిడెంట్ వార్షిక వేతనాని కన్నా రెండు రెట్లు ఎక్కువని చెస్.కామ్ వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడికి వార్షికం వేతనం 4 లక్షల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ.3.3 కోట్లు అన్న మాట. వేతనంతో పాటే 50 వేల డాలర్లు పన్ను రహిత వేతనం, ఇంకా ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు, వినోదం కోసం మరో 19 వేల డాలర్ల జీతాన్ని కూడా అధ్యుక్షుడు అందుకుంటారు. ఈ మొత్తం కలిపితే ఏటా అధ్యక్షుడికి వచ్చేది 5.69 లక్షల డాలర్ల వరకు ఉంటుందట.
కాగా, సింగ్‌పూర్ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ (చైనా)పై గెలిచి విశ్వ విజేతగా అవతరించాడు గుకేశ్. ఈ చిరస్మరణీయ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం అతడికి భారత్ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నను ప్రకటించింది.