భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించి ఈ ఘనత అందుకున్నాడు. 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయస్సులో చదరంగంలో విశ్వవిజేతగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు గారీ కాస్పరోవ్ పేరిట ఉండేది. అతను 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయస్సులో ఛాంపియన్‌గా నిలిచాడు.
ఇక వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన రెండో భారతీయుడిగా గుకేశ్ ఘనత సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత టైటిల్ గెలిచిన భారతీయుడిగా గుకేశ్ రికార్డులకెక్కాడు. విశ్వనాథన్ అయిదు సార్లు ఛాంపియన్‌గా నిలిచాడు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన 14వ రౌండ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్.. డింగ్ లిరెన్‌పై పైచేయి సాధించి గెలిచాడు.

ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల ప్రైజ్‌మనీ గెలిచాడు. రన్నరప్‌గా నిలిచిన 32 ఏళ్ల లిరెన్ రూ.9.75 కోట్లు అందుకున్నాడు. ఇక మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ రూ.21.75 కోట్లు కాగా, ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి రూ.1.69 కోట్లు లభిస్తాయి. ఈ క్రమంలో మూడు గేమ్‌లు గెలిచిన గుకేశ్‌కు రూ.5.07 కోట్లు, రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు దక్కాయి. మిగిలిన నగదు బహుమతిని సమానంగా పంచారు.
