వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత రిలే బృందం అదరగొట్టింది. ఈ విభాగంలో భారత్ నుంచి ఫైనల్ చేరిన తొలి టీంగా రికార్డు నెలకొల్పింది. ఈ టీం కేవలం 2.59.05 సెకన్లలోనే 4x400 రిలే రేసు పూర్తి చేసింది. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ రేస్ పూర్తి చేసిన ఆసియా దేశంగా చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు జపాన్ పేరిట ఉండేది. ఈ క్రమంలో భారత అభిమానులంతా ఈ టీంకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇలాంటి సమయంలో ఈ టీం మెంబర్ అమోజ్ జాకబ్ తమ ప్రదర్శన గురించి మాట్లాడాడు. ఇంత అద్భుతంగా రాణించినా తమను అండర్‌డాగ్స్ అనడాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పాడు. హిస్టరీ క్రియేట్ చేసిన ఈ టీంలో జాకబ్‌తోపాటు మహమ్మద్ అజ్మల్, రాజేష్ రమేష్, అనాస్ యాహియా సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారి వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్ చేరినందుకు వీళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది ఇదే టోర్నీలో ఫైనల్ చేరుకోవడంలో ఈ టీం విఫలమైంది. అలాగే వరల్డ్ కప్‌లో ఆసియా బెస్ట్‌గా తమ పేరిట ఉన్న రికార్డును జపాన్‌కు కోల్పోయింది. ఇదంతా చూసిన నిపుణులు.. భారత బృందానికి సత్తా ఉన్నా ఆశించిన ఫలితాలు రాబట్టడం లేదని ఫీలయ్యారు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత బృందం అదరగొట్టే ప్రదర్శనతో బ్రిటన్, జమైకా వంటి పవర్‌ఫుల్ టీమ్స్‌కు కూడా షాకిచ్చి హీట్స్‌లో రెండో స్థానంలో నిలిచింది.
ఈ క్రమంలో జాకబ్ మాట్లాడుతూ.. ఛాంపియన్‌షిప్స్‌కు ముందు తమపై ఎవరూ పెద్దగా ఫోకస్ పెట్టలేదని, తమని అండర్‌డాగ్స్ అనుకున్నారని చెప్పాడు. అది కూడా టీంకు కలిసొచ్చిందన్నాడు. ఫైనల్‌లో తమకు మెడల్ కూడా వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. 'ఎవరూ మమ్మల్ని ప్రత్యర్థులుగా చూడకపోవడం మంచిదే అయింది. అండర్‌డాగ్స్ అన్నారు. కానీ మేం కూడా ఉన్నాం కదా. ఇప్పుడు వాళ్లందరికీ మేం వస్తున్నామని తెలుస్తుంది' అని జాకబ్ అన్నాడు.
'ఈ రోజు 2.59 నిమిషాల్లో రేస్ పూర్తి చేశాం. రేపు 2.58 నిమిషాల్లో పూర్తి చేస్తాం. ఏమో? మెడల్ కూడా సాధిస్తామేమో?' అని చెప్పాడు. అలాగే రేస్ అనంతరం వీల్ చైర్‌లో స్టేడియం వీడిన టీంమేట్ రాజేష్ రమేష్ గురించి కూడా మాట్లాడాడు. 'తనకు ఏం కాలేదు. పర్లేదు బతికేస్తాడు . రేపు ఇంత కన్నా వేగంగా పరిగెత్తాలి కదా' అని పేర్కొన్నాడు.