హైదరాబాద్: భారత పురుషుల హకీ జట్టు కోచ్‌గా స్జోయెర్డ్ మరిజ్నే ఎంపికయ్యాడు. ఈ మేరకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ట్విట్టర్‌లో ప్రకటించారు. రేసులో వరల్డ్ కప్ సాధించిన జూనియర్ జట్టు కోచ్‌గా ఉన్న హరేంద్ర సింగ్, ఆస్ట్రేలియాకు చెందిన జాక్ స్టాసీలు ఉన్నారు.
అయితే అనూహ్యంగా మహిళల సీనియర్ జట్టు కోచ్ అయిన మరిజ్నేను భారత పురుషుల హకీ జట్టు కోచ్‌గా నియమించారు. భారత హాకీ జట్టు జాతీయ కోచ్ రోలెంట్ ఓల్ట్స్‌మన్‌ను హాకీ ఇండియా ఇటీవలే ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఓల్ట్‌మన్స్ స్థానంలో మరిజ్నే సెప్టెంబర్ 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రస్తుతం ఆయన మహిళా జట్టుతోపాటు యూరప్ పర్యటనలో ఉన్నారు. ఇక జూనియర్ జట్టు కోచ్‌గా ఉన్న హరేంద్ర సింగ్‌ను సీనియర్ మహిళల జట్టు హై పెర్ఫార్మెన్స్ స్పెషలిస్ట్ కోచ్‌గా ఎంపిక చేశారు. ఈ శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
మరిజ్నే, హరేంద్రలు ఇద్దరూ 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసే వరకూ బాధ్యతలు నిర్వహిస్తారని హాకీ ఇండియా అధికారులు తెలిపారు. అయితే ఆరు నెలల ప్రొబేషన్ తర్వాత అతడి పనితీరు సంతృప్తిగా ఉంటేనే కొనసాగిస్తామని అన్నారు. దీంతో పాటు జూనియర్ టీమ్ అంతర్జాతీయ సన్నద్ధతలు, అభివృద్ధి గురించి కూడా పర్యవేక్షించాల్సి ఉంటుందని హాకీ ఇండియా తెలిపింది.
ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు ఆశించినంతగా రాణించకపోవడానికి కోచ్ ఓల్ట్స్‌మన్‌దే బాధ్యతని, భవిష్యత్‌లోనూ అతని వ్యూహాలు పని చేయవన్న నిర్ణయానికి వచ్చిన హాకీ ఇండియా అతనికి ఉద్వాసన పలికింది. అనంతరం మూడు రోజుల కిందట కొత్త కోచ్ కోసం ప్రకటన ఇచ్చింది.
ఈ నేపథ్యంలో సీనియర్ మహిళా హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఉన్న మరిజ్నే భారత పురుషుల హకీ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపడతారని రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవలే జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో రాథోర్ క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
నెదర్లాండ్స్‌కు చెందిన 43 ఏళ్ల మరిజ్నే నూతన బాధ్యతలు స్వీకరించడానికి తొలుత ఆసక్తి కనబర్చలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన మహిళ జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. ఇప్పటి వరకూ ఆయన పురుషుల జాతీయ జట్టుతో కలిసి పని చేయక పోవడం విశేషం.