విజేతగా రెడ్ గెరార్డ్:
స్నోబోర్డింగ్ స్లోప్‌స్టైల్ విభాగంలో స్వర్ణం గెలిచిన రెడ్ గెరార్డ్ (యుఎస్) అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ శతాబ్దంలో పుట్టి శీతకాల ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి వ్యక్తిగా రెడ్ రికార్డు సృష్టించాడు. 2000 జూన్ 29న జన్మించిన రెడ్ వయసు 17 ఏళ్లే. స్నోబోర్డింగ్ విభాగంలో స్వర్ణం గెలిచిన పిన్న వయస్కుడు కూడా అతడే.
పాతికేళ్ల తర్వాత టీనేజర్‌కు పసిడి:
స్వర్ణాన్ని గెలుచుకున్న గెరార్డ్ తన ఆనందాన్ని ఇలా పంచుకున్నాడు. 'నేను ఇది గెలవాలనే సిద్ధమయ్యా. యూఎస్ ఓపెన్, ఎక్స్ గేమ్స్ చూస్తూనే పెరిగాను. ఇక్కడికి రాక ముందు ఒలింపిక్స్ అంటే చాలా పెద్దదేమో అనుకుని భయపడిపోయా. చివరికి సాధించగలిగాను' అని పేర్కొన్నాడు.
విరిగిన 17 ఎముకలను లెక్కచేయక:
ఈ క్రీడలో అపార ప్రతిభను చూపిన మార్క్ మెక్‌మోరిస్ ఎన్నో ఘనతలు సాధించాడు. కానీ ఆ ఆటే అతడికి ప్రాణాన్ని తీసినంత పనిచేసింది. నిరుడు మార్చిలో జరిగిన ప్రమాదంలో అతడికి 17 ఎముకలు విరిగాయి.. ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతిన్నాయి.. అసలు బతుకుతాడో లేదో అనిపించింది.
మళ్లీ ఛాంపియన్‌గా:
చాలాకాలం అపస్మారక స్థితిలో ఉంచి అతడికి చికిత్స అందించారు. చావుతో పోరాడి గెలిచిన అతడు తనకు ప్రాణాంతక గాయాలను మిగిల్చిన ఆటను మాత్రం వదల్లేదు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా తిరిగి సాధన చేసిన కెనడా స్నోబోర్డర్ మెక్‌మోరిస్ తక్కువ కాలంలోనే మళ్లీ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇప్పుడు శీతాకాల ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిశాడు. ఆదివారం స్నోబోర్డ్ స్లోప్‌స్టైల్ విభాగంలో మార్క్ కాంస్యం నెగ్గాడు.
పట్టుదలతో ప్రయత్నించి:
కాంస్యం అయినా అది అతనికి స్వర్ణం కంటే ఎక్కువే. బతకడమే కష్టం అనుకున్న స్థాయి నుంచి ఒలింపిక్స్‌లో పతకం గెలిచే స్థితికి చేరుకోవడంలో అతని పట్టుదలకు నిదరర్శనం. 2014లో సోచి శీతకాల ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మార్క్... ఇతర పోటీల్లో ఎన్నో బంగారు పతకాలు సాధించాడు.
యాక్సిడెంట్ అనంతరం వరల్డ్ విన్నర్:
2017 మార్చిలో కెనడాలో జరిగిన ఓ పోటీలో వేగంగా వెళ్లి చెట్టుకు ఢీ కొట్టడంతో అతను తీవ్ర గాయాల పాలై మృత్యువుకు దగ్గరగా వెళ్లాడు. తిరిగి కోలుకున్న అతను గత నవంబర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో విజేతగా నిలిచాడు.
పాల్గొనాలనే కసే గెలిపించింది:
‘గతాన్ని తలచుకోవాలని లేదు. మళ్లీ స్నో బోర్డును పట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. తిరిగి పోటీల్లో పాల్గొనాలన్న కసే నన్ను ఈ స్థానంలో నిలిపింది. ఈ విజయం సంతోషాన్ని ఇస్తోంది. మళ్లీ స్నోబోర్డింగ్ చేస్తున్నాననే సంతోషం పట్టలేకపోతున్నా' అని కాంస్యం గెలిచిన అనంతరం మార్క్ అన్నాడు.


Click it and Unblock the Notifications












