ఈ ఏడాది క్రీడారంగంలో భారత్ ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు అందుకుంది. ఇందులో పురుషుల టీ20 వరల్డ్ కప్, పారిస్ ఒలింపిక్స్, పారాలంపిక్స్ వంటి అంతర్జాతీయ టోర్నీలు ఉన్నాయి. వీటిలో సత్తా చాటి భారత కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేసిన మేటి క్రీడాకారుల్లో ఒకరికి ప్రతిష్టాత్మక క్రీడా అవార్డు మేజర్ థ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ అవార్డుల నామినేషన్ల జాబితాలో పలువురు మేటి క్రీడాకారుల పేర్లు కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది.
ఈ ఏడాది భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్, ఏస్ డ్రాగ్-ఫ్లిక్కర్ హర్మన్‌ప్రీత్ సింగ్ ను ఖేల్ రత్న అవార్డులకు నామినేట్ చేశారు. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో పురుషుల హాకీలో భారతదేశం పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకుంది. అలాగే పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కూడా ఖేల్ రత్న అవార్డుల జాబితాలో ఉన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో పురుషుల హైజంప్ టీ64లో ప్రవీణ్ ఆసియా రికార్డుతో స్వర్ణం సాధించాడు.

కానీ పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లలో రెండు పతకాలు సాధించిన మనూబాకర్ పేరు మాత్రం ఇందులో కనిపించలేదు. మనూభాకర్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వ వర్గాలు చెబుతున్నట్లు జాతీయ పత్రిక టైమ్స్ నివేదించింది. అయితే ఆమె కుటుంబానికి సన్నిహితులు మాత్రం దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్టు సిరీస్ లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ పేరును కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంపై చర్చ జరుగుతోంది.
అయితే ఈ అవార్డుల నామినేషన్ల చరిత్రను పరిశీలిస్తే క్రీడాకారులు కొన్ని సార్లు అవార్డు కోసం దరఖాస్తు చేసుకోకపోయినా వారికి సుమోటోగా అవార్డులకు ఎంపిక చేసిన సందర్భాలున్నాయి. గతంలో ఇలాగే క్రికెటర్ మొహమ్మద్ షమీ అవార్డుకు దరఖాస్తు చేసుకోకపోయినా ఆయన్ను బీసీసీఐ సిఫార్సు మేరకు అవార్డు కమిటీ పరిగణనలోకి తీసుకుంది. అలాగే ఇప్పుడు కూడా మనూభాకర్ తో పాటు రవిచంద్రన్ అశ్విన్ పేర్లను ఖేల్ రత్న కోసం పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.