
టోక్యో: మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021 ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఒలింపిక్ క్రీడా గ్రామానికి అన్ని దేశాల అథ్లెట్లు బృందాలుగా చేరుకుంటున్నారు. అయితే విశ్వ క్రీడల కోసం జపాన్ వచ్చిన అథ్లెట్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. రోజురోజుకు వైరస్ కేసులు పెరుగుతుండడంతో ఒలింపిక్ క్రీడా గ్రామంలో భయాందోళనలు మొదలయ్యాయి. కరోనా కట్టడికి ఎన్నో చర్యలు తీసుకున్నా.. కేసులు పెరుగుతూ పోతుండడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టోక్యో నిర్వాహకులు అథ్లెట్లకు కరోనా మార్గదర్శకాలను విదులచేసి భారీ షాక్ ఇచ్చారు. ఏ అథ్లెట్ అయినా పాజిటివ్‌గా తేలితే.. వారు మ్యాచ్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అయితే ఈవెంట్ నుంచి మాత్రం కాదు.
టోక్యో ఒలింపిక్స్ 2021లో ఏ అథ్లెట్ లేదా జట్టు అయినా పాజిటివ్‌గా తేలితే.. వారు ఆడాల్సిన తదుపరి మ్యాచుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అయితే వారు అనర్హులుగా మాత్రం పరిగణించబడరు. టోర్నీలో కొనసాగుతారు. తుది ఫలితం మాత్రం ఆట లేదా జట్టుపై ఆదారపడి ఉంటుంది. బ్యాడ్మింటన్ ఆటలో కరోనా కారణంగా ఓ షట్లర్ ఆడకపోతే.. ప్రత్యర్థి తదుపరి రౌండ్‌కి బై పొందుతాడు. రెజ్లింగ్‌లో కూడా ఈ నియమాలు ఉంటాయి. ఫైనల్ విషయంలో కూడా ఇదే జరుగనుంది. టెన్నిస్ మరియు బాక్సింగ్‌లో ఫైనల్లో ఈ సంఘటన ఎదురైతే.. కరోనా సోకిన వ్యక్తికి సిల్వర్ మెడల్, ప్రత్యర్థికి గోల్డ్ మెడల్ ఇస్తారు. రగ్బీ, హాకీ లేదా ఫుట్‌బాల్ వంటి జట్టు ఈవెంట్లలో కరోనా సోకిన జట్టు ప్రత్యర్థి తదుపరి రౌండ్‌కి వెళుతుంది. ఫైనల్లో మాత్రం కరోనా సోకిన జట్టు నిష్క్రమించబడుతుంది. ఆ జట్టుతో సెమీ ఫైనల్లో ఓడిన జట్టు పతక రేసులో ఉంటుంది.
తాజాగా మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇందులో ఓ విదేశీ అథ్లెట్ కూడా ఉన్నాడు. దీంతో ఆటలకు సంబంధమున్న కేసుల సంఖ్య 67కు పెరిగింది. ఇందులో ఓ క్రీడాకారిణి ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఉన్నట్లు తెలిసింది. అంతకుముందు మెక్సికోకు చెందిన ఇద్దరు బేస్ బాల్ ఆటగాళ్లకు కరోనా సోకినట్లు తేలింది. టోక్యోకు బయలుదేరే ముందు వీరికి కరోనా పరీక్ష చేయగా వైరస్ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని మెక్సికో బేస్ బాల్ వర్గాలు ధ్రువీకరించాయి. అమెరికా జిమ్నాస్ట్ క్రీడాకారిణికి కూడా కొవిడ్ సోకింది. ఆమె పేరు వెల్లడించలేదు. చిబాలో ప్రి టోక్యో ఒలింపిక్స్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నట్లు తెలిసింది.