అగర్తాలా: రియో ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్య పతకం చేజారిన దీపా కర్మాకర్ తన అద్భుత ప్రదర్శనతో భారతీయుల మనసులను కొల్లగొట్టింది. ఆమె పతకం గెలవకున్నా.. అందరి మన్ననలు పొందుతోంది. దీప సోమవారం నాడు త్రిపుర రాజధాని అగర్తలాకు చేరుకుంది.

అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. అగర్తలా విమానాశ్రయం నుంచి సుమారు 12 కిలో మీటర్ల ఓపెన్ టాప్ జీపులో ఆమెను ఊరేగిస్తూ విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. ఆమెతో పాటు కోచ్ బిశ్వేశ్వర్ నంది కూడా ఉన్నారు. వేలాది అభిమానులు ఆమె వెంట తరలివెళ్లారు.
మైదానంలో దీపా కర్మాకర్‌ను త్రిపుర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అయితే, దీపకు స్వాగతం పలుకుతున్న అభిమానులలో ఆమె అక్కయ్య కూడా ఉంది. దీప తన అక్కను చూడగానే ఒక్కసారిగా జీపులో నుంచి బయటకు గెంతి, ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది.