Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వినేష్ ఫోగాట్‌పై నిషేధం?

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్, భారత రెజ్లింగ్ సమాఖ్య (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మధ్య నడుస్తున్న పోరు మరో ముదురు పాకాన పడింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, మళ్లీ మ్యాట్‌పై తన సత్తా చాటాలని భావించిన వినేష్‌కు ఫెడరేషన్ గట్టి షాకిచ్చింది. మే 10 నుంచి 12 వరకు గోండాలో జరగాల్సిన జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించింది. వినేష్ రీ-ఎంట్రీకి ఈ పోటీ ఒక వేదిక కావాల్సి ఉండగా.. సమాఖ్య నిర్ణయంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

15 పేజీల నోటీసు.. తీవ్ర ఆరోపణలు

వినేష్ ఫోగాట్‌కు జారీ చేసిన 15 పేజీల నోటీసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమెపై నిప్పులు చెరిగింది. క్రమశిక్షణారాహిత్యం, డోపింగ్ వ్యతిరేక నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలను ప్రస్తావిస్తూ జూన్ 26, 2026 వరకు ఆమెను దేశీయ పోటీలకు అనర్హురాలిని చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ రెజ్లింగ్ నియమాల ప్రకారం.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారులు తిరిగి రావాలంటే ఆరు నెలల ముందుగానే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వినేష్ ఈ నియమాన్ని పాటించలేదని, ఆమె ప్రవర్తన దేశ ప్రతిష్టను, భారత రెజ్లింగ్ ఇమేజ్‌ను దెబ్బతీసిందని సమాఖ్య ఘాటుగా ఆరోపించింది.

వినేష్ వివరణ కోరిన నాలుగు అంశాలు

ఈ వివాదంలో ఫెడరేషన్ ప్రధానంగా నాలుగు అంశాలపై వినేష్ నుంచి వివరణ కోరింది. ఆ నాలుగు అంశాలపై 14 రోజులలోపు సమాధానం ఇవ్వాలని వినేష్‌కు గడువు విధించారు. ఆ నాలు అంశాలు ఇవే..

పారిస్ ఒలింపిక్స్ వివాదం: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరువు నియంత్రించలేక అనర్హతకు గురవ్వడం.

డోపింగ్ వివరాలు: డోపింగ్ పరీక్షలకు సంబంధించి తన ఆచూకీ (వేర్ అబౌట్స్) వివరాలను సరిగ్గా సమర్పించకపోవడం.

సెలక్షన్ ట్రయల్స్: గతేడాది మార్చిలో జరిగిన ట్రయల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా రెండు వేర్వేరు బరువు విభాగాల్లో పోటీ పడటం.

నిబంధనల ఉల్లంఘన: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రూల్స్, అంతర్జాతీయ రెజ్లింగ్ నియమాలను తుంగలో తొక్కడం.

ఆసియా క్రీడల ఆశలకూ గండి

కేవలం దేశీయ టోర్నీలే కాకుండా రాబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశాలకూ ఫెడరేషన్ అడ్డుకట్ట వేసింది. సమాఖ్య ప్రవేశపెట్టిన నూతన అర్హత ప్రమాణాల ప్రకారం.. 2025-2026లో పతకాలు సాధించిన రెజ్లర్లు మాత్రమే సెలక్షన్ ట్రయల్స్‌కు అర్హులు. పారిస్ ఒలింపిక్స్ వివాదం తర్వాత వినేష్ ఎటువంటి అధికారిక పోటీల్లో పాల్గొనకపోవడంతో, ఆమె ఈ నిబంధనల పరిధిలోకి రాకుండా పోయింది. ఇది వినేష్ ఫోగాట్ కెరీర్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అంశం.

కొనసాగుతున్న ప్రతీకార రాజకీయాలు?

వినేష్ ఫోగాట్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మధ్య వైరం నిన్న మొన్నటిది కాదు. తన రీ-ఎంట్రీని ఫెడరేషన్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని వినేష్ గతంలోనే ఆరోపించింది. జాతీయ ర్యాంకింగ్ ఛాంపియన్‌షిప్‌ల నమోదు సమయంలో కూడా తనకు ఇబ్బందులు సృష్టించారని ఆమె పేర్కొంది. సమాఖ్య ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే వినేష్‌కు, రెజ్లింగ్ సమాఖ్యకు మధ్య ఉన్న విభేదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వినేష్ ఫోగాట్ తన వివరణను ఎలా ఇస్తుంది, ఫెడరేషన్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Story first published: Saturday, May 9, 2026, 15:04 [IST]
Other articles published on May 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+