
2024 పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో 73కేజీల విభాగంలో పాల్గొనడానికి భారత్‌కు చెందిన ఇద్దరు స్టార్ వెయిట్ లిఫ్టర్లు జెరెమీ లాల్రిన్నుంగా, అచింత షెవులీ పోటీపడబోతున్నారు. వీరిద్దరు గోల్డ్ మెడలిస్టులు అయినా.. వీరిలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుంది. NIS పాటియాలాలోని జాతీయ శిబిరంలో మరో వారం వ్యవధిలో వీరిద్దరు శిక్షణకు తిరిగి రాబోతున్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో లాల్రిన్నుంగా 67కేజీల విభాగంలో పోటీపడ్డాడు. కానీ ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ఐదు కేటగిరీలలో ఈ విభాగం లేదు. దీంతో అతను 73కేజీల విభాగానికి మారాల్సిన అవసరమొచ్చింది. అచింత షెవులీ సైతం ఇదే విభాగంలో పటీపడబోతున్నాడు.
ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం.. ఒక ఈవెంట్లో ఒక దేశం నుంచి ఒక అథ్లెట్ మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరు లిఫ్టర్లలో ఒకరు మాత్రమే ఈ విభాగంలో ఒలింపిక్స్‌లో పాల్గొనగలరు. నవంబర్-డిసెంబర్‌లో కొలంబియాలో జరిగే 2022ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల నుండి ఆరు అంతర్జాతీయ పోటీలలో వెయిట్‌లిఫ్టర్ల ఫలితాల ఆధారంగా IWF ర్యాంకింగ్ ఉంటుంది. అందులో మెరుగైన ప్రదర్శన కనబర్చినవారికే ఒలింపిక్స్‌లో చోటు దక్కుతుంది. దీంతో భారత్‌కు చెందిన ఇద్దరు గోల్డ్ మెడలిస్టులు ఒలింపిక్స్ స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక జెరెమీ 73కిలోల విభాగంలో తన శిక్షణను ప్రారంభిస్తానని చెప్పాడు.
అయితే 73కిలోల విభాగంలో షెవులీ ఇప్పటికే 316కిలోల బరువు ఎత్తి జాతీయ రికార్డును కలిగి ఉన్నాడు. జెరెమీ అత్యుత్తమ వెయిట్ లిఫ్టింగ్ 306కిలోలు మాత్రమే. దీంతో జెరెమీ కాస్త వెనకబడ్డట్లు కన్పిస్తున్నా.. మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయి. పారిస్‌లో జరిగే 2024ఒలింపిక్స్‌లో మొత్తం 10వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలుంటాయి. (వుమెన్స్ 5, పురుషులు 5). అన్ని కేటగిరీల్లో కలిపి ఒక్కో దేశానికి ఆరుగురు అథ్లెట్లు (జెండర్‌కు ముగ్గురు చొప్పున) అనుమతించబడతారు. పురుషుల్లో 61కేజీలు, 73కేజీలు, 89కేజీలు, 102 కేజీలు, +102 కేజీల విభాగాలున్నాయి. మహిళల ఐదు కేటగిరిల్లో 49కేజీలు, 59 కేజీలు, 71 కేజీలు, 81 కేజీలు, +81 కేజీల విభాగాలున్నాయి. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను 49కిలోల విభాగంలో పోటీలో పాల్గొనబోతుంది.