Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చూడముచ్చటగా ఢాకాలో ప్రపంచ కప్ ప్రారంభోత్సవ ధమాకా

Dhoni
ఢాకా: క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న 2011 ప్రపంచ కప్‌ ప్రారంభానికి శ్రీకారం జరిగింది. ఉత్సాహభరిత వాతావరణం మధ్య గురువారం సాయంత్రం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నడిబొడ్డున ఉన్న బంగబంధు నేషనల్‌ స్టేడియంలో టోర్నీ ప్రారంభ వేడుక కన్నుల పండుగగా జరిగింది. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన బంగ్లాదేశ్‌ జాతీయ గీతం 'అమర్‌ షోనార్‌ బంగ్లా...' ఆలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. సంప్రదాయం, ఆధునికతల కలబోతగా దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తిలకించారు. గతంలో ఉపఖండం ఆతిథ్యమిచ్చిన 1996 ప్రపంచ కప్‌ ప్రారంభ వేడుక పశ్చిమ బెంగాల్లో(కోల్‌కతాలో) జరగ్గా ఈసారి తూర్పు బెంగాల్లో(బంగ్లాదేశ్‌)లో నిర్వహించడం గమనార్హం.

పదో ప్రపంచ కప్‌ సంరంభాన్ని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా లాంఛనంగా ప్రారంభించారు. ఒక ప్రత్యేక స్కానర్‌పై ఆమె అరచేతిని ఉంచగానే ఆకాశం తారాజువ్వల వెలుగులతో నిండిపోయింది. టోర్నీ ఆరంభమైనట్లు ప్రకటన వెలువడింది. ప్రారంభోత్సవానికి ఐసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌, బంగ్లాదేశ్‌ మంత్రులు, క్రికెట్‌ బోర్డుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథి మాత్రం ప్రపంచ కప్‌ మస్కట్‌ 'స్టంపీ'నే! దానికి ఆహ్వానం పలికాక, ఉపఖండ ప్రజల జీవనశైలిలో భాగమైన రిక్షాలపై 14 జట్ల సారథులను స్టేడియంలోని వేదిక వద్దకు తీసుకొచ్చారు.

టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకలకు చెందిన బృందాలు తమకే ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలో అందరినీ మెప్పించాయి. మూడున్నర వేల మంది కళాకారులు ఈ మూడు దేశాల సంస్కృతులను విభిన్న రీతుల్లో ప్రదర్శించారు. మొత్తం కార్యక్రమంలో అందరినీ అబ్బురపరిచింది మాత్రం ఏరియల్‌ క్రికెట్టే! కొందరు ఆక్రోబాట్లు తాళ్ల సాయంతో ఒక భవనానికి సమాంతరంగా వేలాడుతూ, లేజర్‌, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆడిన ఈ క్రికెట్‌ వీక్షకుల్ని కట్టిపడేసింది.

క్రికెట్‌ ప్రేమికులకు ఆహ్వానం పలుకుతూ బంగ్లా పాప్‌ తారలు పాడిన పాట ఉత్తేజపరిచింది. 'లెట్స్‌ గో ఫర్‌ ద గ్లోరీ...' అంటూ భారత గాయకుడు సోనూ నిగమ్‌ ఆలపించిన క్రికెట్‌ స్ఫూర్తిగీతం ఆకట్టుకుంది. బంగ్లా గాయనీమణులు రూనాలైలా, సబీనా యాస్మిన్‌, ముంతాజ్‌ గీతాలు ఆహ్లాదపరిచాయి.కెనడా గాయకుడు బ్రియాన్‌ ఆడమ్స్‌ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 'లెట్స్‌ మేక్‌ ఇట్‌ ఎ నైట్‌ టు రిమెంబర్‌', 'సమ్మర్‌ ఆఫ్‌ 69' లాంటి గీతాలతో స్టేడియాన్ని ఉర్రూతలూగించారు.

భారత త్రయం శంకర్‌-ఎహ్‌సాన్‌-లాయ్‌ ఆలపించిన టోర్నీ భావగీతం 'దే గుమా కే' ఉద్వేగాన్ని నింపింది. ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగసిన బాణసంచా వెలుగులు, లేజర్‌ కాంతుల మధ్య ప్రారంభ వేడుక ముగిసింది. ఆరు వారాలపాటు సాగే ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ శనివారం మీర్‌పూర్‌(బంగ్లాదేశ్‌)లో భారత్‌, బంగ్లా జట్ల మధ్య జరుగనుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+