హైదరాబాద్: జాన్ సెనా... డబ్ల్యూడబ్ల్యూఈ మల్లయుద్ధ పోటీలు చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు. 'నెవర్ గివ్ అప్' అంటూ బరిలోకి దిగే జాన్ సెనా ఎంతోమంది అభిమానుల్లో స్ఫూర్తి నింపాడు. అభిమానుల ఇచ్చిన సర్ప్రైజ్ని చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంతేకాదు ఈ వీడియోని వీక్షించిన వారిని కూడా ఉద్వేగానికి లోను చేస్తోంది. ఈ వీడియోలో అభిమానులు తనకు కృతజ్ఞతగా రాసిన ఉత్తరాలను జాన్ చదువుతూ ఉంటాడు. వారి కష్టాల నుంచి బయటపడటానికి జాన్ సెనా ఎలా సాయం చేశాడో ఆ ఉత్తరాల్లో వారంతా వివరించారు.
జాన్ ఉత్తరాలు చదివే సమయంలో అభిమానులు హెడ్ ఫోన్స్ ద్వారా వింటూ ఉంటారు. చివర్లో ఓ బాలుడు పంపిన వీడియోని జాన్ చూస్తాడు. తన తల్లి కేన్సర్ చికిత్సలో భాగంగా జాన్ చెప్పిన నెవర్ గివ్ అప్ బ్యాడ్జి ఎలా ఉపయోగపడిందో అందులో వివరిస్తాడు.
అదే సమయంలో బాలుడు కాస్తంత ఉద్వేగానికి లోనవుతాడు. అది చూసిన జాన్ కూడా కంటతడి పెట్టుకుంటాడు. అనంతరం స్టూడియోలోనే ఓ పక్కన ఉన్న ఆ బాలుడు పోస్టర్ని చించుకుని జాన్ వద్దకు వస్తాడు. అతడిని చూసిన సర్ప్రైజ్ క్షణంలో జాన్ ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఆ తర్వాత జాన్ చదివిన ఉత్తరాలు రాసిన వారందరూ ఒక్కొక్కరుగా జాన్ ముందుకు వస్తారు. వారందరిని జౌన్ కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. చివర్లో వారంతా 'లైఫ్ చేంజర్' అని రాసి ఉన్న కప్‌ను జాన్ సెన్కు బహుమతిగా ఇస్తారు.