సోచి(రష్యా): ప్రపంచ చెస్ సంగ్రామంలో భారత చెస్ దిగ్గజం, ఐదు సార్లు విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి పరాజయం ఎదురైంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆదివారమిక్కడ జరిగిన రెండో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ 35 ఎత్తుల్లో ఆనంద్‌కు షాకిచ్చాడు.
తొలి రౌండ్‌లో మెరుగ్గా ఆడిన భారత చెస్ స్టార్.. ఈ గేమ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మరో పది రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో ఆనంద్ (0.5) కంటే కార్ల్‌సన్ (1.5) పాయింట్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్, నార్వే యువ సంచనానికి గట్టి పోటీ ఇవ్వలేక పోయాడు.
ఇద్దరు ఆటగాళ్లు తొలి ఏడు ఎత్తుల వరకూ ఒక నిమిషం కంటే ఎక్కువ తీసుకోలేదు. అయితే ఎనిమిదో ఎత్తు నుంచి ఆనంద్ క్రమంగా బోర్డుపై పట్టు కోల్పోయాడు. కాగా సోమవారం టోర్నీకి విశ్రాంతి దినం.

సత్తాచాటిన పూర్వాష
న్యూఢిల్లీ: జాతీయ ఆర్చరీ ర్యాంకింగ్ టోర్నీలో విజయవాడకు చెందిన పూర్వాషా సుధీర్ షిండే సత్తా చాటింది. సబ్-జూనియర్ విభాగంలో స్వర్ణం, జూనియర్, సీనియర్ మహిళల కాంపౌండ్ విభాగాల్లో రజత పతకాలు సాధించింది. ఆదివారం జరిగిన సబ్-జూనియర్ ఫైనల్లో పుర్వాషా.. మరో తెలుగమ్మాయి జ్యోత్స్నపై విజయం సాధించి పసిడి పతకంతోపాటు 40 వేల రూపాయల నగదు బహుమతిని అందుకుం ది.
జూనియర్ మహిళల విభాగం ఫైనల్లో ఓటమి పాలైన పూర్వాషా రజతాన్ని సొంతం చేసుకుంది. ఇక సీనియర్ మహిళల విభాగం ఫైనల్లో త్రిషా దేవ్ (పంజాబ్) చేతిలో ఓడి రజత పతకంతోపాటు 75 వేల నగదు పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ విభాగంలో మూడో స్థానంలో నిలిచిన జ్యోతి సురేఖ కాంస్యం తోపాటు 50 వేల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. తమ క్రీడాకారిణులు పూర్వాషా, జోత్న్స పతకాలు సాధించడం ఆనందంగా ఉందని ఓల్గా అకాడమీ అధ్యక్షులు చెరుకూరి సత్యనారాయణ తెలిపారు.