
హైదరాబాద్: సౌదీ అరేబియా రాజధాని రియధ్‌లో జరుగుతున్న ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన జోరుని కొనసాగిస్తున్నాడు. బుధవారం ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)ను ఓడించాడు. బుధవారం ఓపెన్ విభాగంలో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 34 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను చిత్తు చేశాడు.
తొలి రోజు ఐదు రౌండ్లలో మూడు విజయాలు సాధించి.. రెండు గేమ్‌లను డ్రా చేసుకున్న ఆనంద్.. రెండో రోజు కార్ల్‌సన్‌తో గేమ్‌కు ముందు ఒక విజయం నమోదు చేసి మరో రెండు గేమ్‌లను డ్రాగా ముగించాడు. అగ్రస్థానంలో ఉన్న వ్లాదిమిర్ ఫెదోసివ్ (రష్యా)తో ఎనిమిదో రౌండ్ గేమ్‌ను కూడా డ్రా చేసుకున్నాడు.
ఆ తర్వాత వాంగ్ హావో (చైనా)తో జరిగిన పదో రౌండ్ గేమ్‌ను 23 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. దీంతో 10 రౌండ్లు ముగిసే సరికి ఆనంద్ 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో రష్యాకు చెందిన ఫెదోసివ్ (8 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ 6 పాయింట్లతో 37వ స్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం జరిగిన ఐదు గేముల్లో మూడు గేమ్‌లు డ్రా చేసుకోగా... ఒక గేమ్‌లో గెలిచి.. మరో గేమ్‌లో ఓడిపోయాడు. మహిళల విభాగంలో హారికకు తొలి ఓటమి ఎదురైంది. దీంతో 7 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.
రెండో రోజు మొత్తం ఐదు రౌండ్లలో ఒక గేమ్‌లో ఓటమిపాలై, రెండు విజయాలు.. 2 డ్రాలు నమోదు చేసింది. మహిళల్లో చైనాకు చెందిన జువెన్‌జున్ అగ్రస్థానంలో ఉంది.