
హైదరాబాద్: లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్‌కు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రఖ్యాత గ్రాండ్ మాస్టర్ సూర్య శేఖర్ గంగూలీ డిమాండ్ చేశాడు. ఇటీవలే రియాధ్ వేదికగా జరిగిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విశ్వనాథన్ ఆనంద్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఇదే వేదికగా జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో 48 ఏళ్ల ఆనంద్ నిర్ణీత 21 రౌండ్‌లు పూర్తయ్యాక 14.5 పాయింట్లతో సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.
కాగా, మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించగా కర్జాకిన్‌కు రెండో స్థానం, ఆనంద్‌కు మూడో స్థానం లభించాయి. దీంతో ఒక్కోక్కటి మూడు నిమిషాల నిడివిగల 21 గేముల్లో ఆనంద్ తొమ్మిదింటిలో విజయం సాధించి, 11 గేమ్‌లను 'డ్రా' చేసుకున్నాడు. మరో గేమ్‌లో ఓడిపోయాడు. 16 పాయింట్లతో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ బ్లిట్జ్ టోర్నీ విజేతగా నిలిచాడు.
ఈ సందర్భంగా 2009 ఆసియా ఛాంపియన్, ఆరుసార్లు ఇండియన్ ఛాంపియన్ అయిన సూర్య శేఖర్ గంగూలీ తాజాగా కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ 'రాపిడ్ చెస్‌లో 15 గేమ్‌లు, బ్లిట్జ్ టోర్నీలో 21 గేమ్లు ఆడాడు. రాపిడ్ చెస్ రౌండ్లలో ఒక్కో గేమ్‌కు గాను 15 నిమిషాల సమయం ఉంటుంది. అదే బ్లిట్జ్ టోర్నీలో ఒక్కో గేమ్‌కు కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. 21 రౌండ్ల వరకు ఆడిన ఆనంద్ ఎంతో నిబద్ధతతో అద్భుతమైన ప్రణాళికలను రచించాడు' అని పేర్కొన్నాడు.
'మూడు నిమిషాల నిడివిగల 21 గేముల్లో ఆనంద్ తొమ్మిదింటిలో విజయం సాధించి, 11 గేమ్‌లను 'డ్రా' చేసుకున్నాడు. ఒక్క గేమ్‌లో మాత్రమే ఓడిపోయాడు. 48 ఏళ్ల వయసులో కూడా ఇంత అద్భుతంగా ఆడాటంటే నమ్మశక్యం కావడం లేదు. కార్ల్‌సన్‌తో గేమ్ ఆడుతున్న సమయంలో నేను డిన్నర్ చేస్తున్నా. నా సెల్ ఫోన్లలో ఆనంద్ గేమ్‌ను చూస్తూనే ఉన్నా. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత మాతో కలిసి ఆనంద్ డిన్నర్ చేశాడు. ఈ సమయంలో ఆనంద్ కాస్తంత ఉద్వేగానికి గురయ్యాడు' అని తెలిపాడు.
ఈ గెలుపు ప్రపంచ చెస్‌లోనే ఓ నూతన అధ్యాయమని గంగూలీ చెప్పుకొచ్చాడు. 'ఆనంద్ సాధించిన ఎన్నో అద్భుత విజయాలను నేను చూశా. అయితే ఈ విజయం మాత్రం 2025లో మహేంద్ర సింగ్ ధోని సెంచరీ లేదా డబుల్ సెంచరీ చేసిన దానితో సమానం' అని ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఆనంద్ ఇప్పటికీ తన స్ధానాన్ని పదిలం చేసుకుంటున్నాడు.
'విశ్వనాథన్ ఆనంద్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వకూడదు? ఈ అవార్డు పొందేందుకు అతడు ఇంకా ఎన్ని గేముల్లో విజయం సాధించాలి. ఈ వయసులో కూడా ఆనంద్ ఈ ఘనత సాధించాడంటే అద్భుతం' అని కొనియాడాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.