For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆనంద్ శకం అంతం: చెస్ కొత్త రారాజు కార్ల్‌సెన్

By Pratap

చెన్నై: చెస్ ప్రపంచ క్రీడారంగంలో విశ్వనాథన్ ఆనంద్ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. మాగ్నస్ కార్ల్‌సన్ చెస్ రారాజుగా అవతరించాడు. నార్వే గ్రాండ్ మాస్టర్, 22 ఏళ్ల ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్ చెస్‌లో కొత్త చాంపియన్‌గా అవతరించాడు. ఐదు పర్యాయాలు టైటిల్ సాధించిన డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో తలపడిన కార్ల్‌సెన్ పదో గేమ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా, విజయానికి అవసరమైన 6.5 పాయింట్లను చేరుకున్నాడు. 12 గేమ్స్ జరిగే ఈ పోటీల్లో మూడు పరాజయాలు ఎదుర్కొన్న ఆనంద్ చివరి మూడు గేమ్స్‌ను గెలవడం తప్పనిసరిగా మారింది.

తీవ్రమైన ఒత్తిడితో పదో గేమ్‌లో బరిలోకి దిగిన అతను 65 ఎత్తులు పోరాడినప్పటికీ లాభం లేకపోయింది. ఈ గేమ్‌లో ఫలితం తేలదని స్పష్టం కావడంతో పదో గేమ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఈ గేమ్ ఆరంభానికి ముందు 6-3 తేడాతో ఆధిక్యంలో ఉన్న కార్ల్‌సెన్ చివరి మూడు గేమ్స్‌లో టైటిల్‌కు ఒక డ్రా దూరంలో నిలిచాడు. అందుకే, ఎలాంటి ఒత్తిడి లేకుండా అతను ఆరంభం నుంచి చివరి వరకూ గేమ్‌ను డ్రా చేసుకోవడానికి ప్రయత్నించి సఫలమయ్యాడు. ఈ పోటీల నిబంధనలను అనుసరించి ముందుగా 6.5 పాయింట్లు సంపాదించిన ఆటగాడికి టైటిల్ లభిస్తుంది. పదో గేమ్‌లోనే కార్ల్‌సెన్ ఈ పాయింట్లను చేరుకొని, కెరీర్‌లో తొలిసారి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.

Viswanathan Anand of India and Magnus Carlsen

నల్లపావులతో ఆటను ఆరంభించిన ఆనంద్‌కు సహనానికి కార్ల్‌సెన్ ఆరంభం నుంచే పరీక్ష పెట్టాడు. పటిష్టమైన రక్షణ వలయాన్ని రూపొందించుకొని, ఆనంద్ బలగాలు ముందుకు సాగకుండా నిలువరించాడు. మొదటి గంటలో ఆనంద్ దూకుడుకు కార్ల్‌సెన్ అదే స్థాయిలో సమాధానమిచ్చాడు. ఒకవైపు రక్షణాత్మక విధానాన్ని అనుసరిస్తూనే మరోవైపు వేగంగా ప్రతిబంధకాలను సృష్టించాడు. తొలి గంటలో ఇరువురు 21 ఎత్తులు వేయగా, రెండో గంట ఆటలో ఇరువురు జోరు తగ్గించి, ఆచితూచి పావులను కదిపారు. దీనితో ఏడు ఎత్తులు మాత్రమే సాధ్యమయ్యాయి. ఈ దశలో ఇరువురికి విజయావకాశాలు సమానంగా కనిపించాయి. ఆతర్వాత మరో 20 ఎత్తుల వరకూ ఇరువురి మధ్య సంకుల సమరం కొనసాగింది.

కార్ల్‌సెన్ రక్షణ వలయాన్ని ఛేదించడానికి ఆనంద్ విశ్వప్రయత్నం చేశాడు. దూసుకొస్తున్న ఆనంద్‌ను నిలువరించడంలో కార్ల్‌సెన్ మునిగిపోయాడు. 41 ఎత్తుల తర్వాత అతను కొద్దిపాటి ఆధిక్యాన్ని కనబరచినా, ఆనంద్ విజయావకాశాలు కూడా సజీవంగానే కనిపించాయి. ఈ దశ దాటిన తర్వాత కార్ల్‌సెన్ కూడా వ్యూహాన్ని మార్చుకొని, విజయమే లక్ష్యంగా బలగాలను కదిపాడు. దీనితో ఆత్మరక్షణలో పడడం ఆనంద్ వంతైంది. చివరికి కార్ల్‌సెన్ విజయాన్ని అడ్డుకున్న ఆనంద్, గేమ్‌ను డ్రాగా ముగించాడు.

41 ఏళ్ల ఆనంద్ 2007 నుంచి ప్రపంచ చాంపియన్‌గా కొనసాగుతుండగా, అతని ఆధిపత్యానికి 22 ఏళ్ల కార్ల్‌సెన్ విజయవంతంగా ముగింపు పలికాడు. 2010 నుంచి అత్యధిక ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ కార్ల్‌సెన్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్ ఇప్పటి వరకూ దక్కలేదు. అనధికారికంగా విశ్వవిజేతగా ఉన్న అతను ఇప్పుడు పూర్తి స్థాయి చాంపియన్‌గా అవతరించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+