భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. రెజ్లింగ్‌లోకి తిరిగి వస్తున్నట్లు ఆమె ప్రకటించింది. 2028లో జరగనున్న లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని వినేశ్ ఫొగాట్ లక్ష్యంగా పెట్టుకుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశ.. ఆ తర్వాత రిటైర్మెంట్
పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుని ఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచ నంబర్ వన్ రెజ్లర్‌ను కూడా ఓడించింది. అయితే ఫైనల్‌కు ముందు వినేశ్ ఫొగాట్ బరువు నిర్దేశించిన దాని కంటే ఎక్కువగా ఉండటం వల్ల డిస్‌క్వాలిఫై అయింది. దీనిపై పెద్ద వివాదం చెలరేగింది. మెడల్ గెలవాలన్న ఆమె కల చెదిరింది. దీంతో వినేష్ కుస్తీకి రిటైర్మెంట్ ప్రకటించి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్‌లో చేరి హర్యానాలోని జులనా నుంచి బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్‌పై విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందింది.

'ఆ మంట చల్లారలేదు': వినేశ్ భావోద్వేగ పోస్ట్
తాజాగా వినేశ్ ఫొగాట్ తన నిర్ణయాన్ని మార్చుకుని రెజ్లింగ్‌లోకి తిరిగి వచ్చే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఆమె ఆశిస్తోంది. "పారిస్ ఒలింపిక్స్‌తో నా ప్రయాణం ముగిసిందా అని చాలా మంది అడిగారు. చాలా కాలం వరకు నా దగ్గర సమాధానం లేదు. నాకు ఒత్తిడి, అంచనాలు, చివరికి నా కలలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కొన్నేళ్లలో మొదటిసారిగా, నేను శ్వాస తీసుకునేందుకు సమయం దొరికింది. నా ప్రయాణం భారాన్ని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నాను - ఎత్తుపల్లాలు, గుండె బద్దలు, త్యాగాలు, ప్రపంచం చూడని నా రూపాలు. ఆ ఆలోచనలలో ఎక్కడో, నాకు నిజం దొరికింది, నాకు ఇప్పటికీ ఈ ఆట అంటే ఇష్టం. నేను ఇప్పటికీ పోటీ పడాలనుకుంటున్నాను" అని వినేశ్ ఫొగాట్ రాసుకొచ్చింది.
ఆమె కొనసాగిస్తూ, "ఆ నిశ్శబ్దంలో నేను మర్చిపోయిన ఒక విషయం దొరికింది - 'ఆ మంట ఎప్పటికీ చల్లారదు'. అది అలసట కింద అణిచివేయబడింది. క్రమశిక్షణ, నిత్యకృత్యం, పోరాటం... ఇదంతా నా సిస్టమ్‌లో ఉంది. నేను ఎంత దూరంగా వెళ్లినా, నాలో ఒక భాగం మ్యాట్‌పైనే ఉండిపోయింది" అని పేర్కొంది.
కొడుకుతో కలిసి లాస్ ఏంజెల్స్ వైపు
చివరిగా, వినేశ్ ఫొగాట్ ఈసారి ఒంటరిగా నడవట్లేదని ప్రకటించింది. "నేను ఇక్కడ ఉన్నాను. లాస్ ఏంజెల్స్ వైపుకు తిరిగి అడుగులు వేస్తున్నాను. భయం లేని హృదయం, లొంగిపోవడానికి నిరాకరించే స్ఫూర్తితో తిరిగొస్తున్నాను. ఈసారి నేను ఒంటరిగా నడవడం లేదు, నా కొడుకు, నా జట్టు, నా అతిపెద్ద ప్రేరణ, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ వైపు ఈ మార్గంలో నా చిన్న చీర్‌లీడర్‌గా నాతో పాటు చేరుతున్నారు," అని వినేశ్ రాసుకొచ్చింది. దీని ద్వారా వినేశ్ ఎమ్మెల్యేగా తన పదవిని కొనసాగిస్తూనే, మళ్లీ రెజ్లింగ్ మ్యాట్‌పై సత్తా చాటడానికి సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది.