వినేష్ ఫోగట్‌కు లైన్ క్లియర్!
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సుదీర్ఘ న్యాయపోరాటంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. ఆసియా క్రీడల ట్రయల్స్‌లో ఆమె కోరుకున్న 53 కిలోల విభాగంలో పోటీ పడేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు వినేష్‌ను 50 కిలోల విభాగంలోనే బరిలోకి దిగాలని డబ్ల్యూఎఫ్‌ఐ ఆదేశించగా.. ఆమె దానిని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించింది. శనివారం (మే 30) నాటి ఈ నిర్ణయంతో వినేష్‌కు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఈ ట్రయల్స్ నిర్వహణకు ముందు రోజు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. కోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తున్నామని భారత కుస్తీ సమాఖ్య వర్గాలు వెల్లడించాయి. వినేష్ వైపు నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఈమెయిల్ లేదా అధికారిక సమాచారం అందనప్పటికీ.. తాము ఆమెను పోటీ పడేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశాయి. అయితే, పోటీల సమయంలో కేవలం డబ్ల్యూఎఫ్‌ఐ నిబంధనలు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నాయి. ఈ ట్రయల్స్‌కు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA), క్రీడా మంత్రిత్వ శాఖ నుండి పరిశీలకులు హాజరైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, సుప్రీంకోర్టు దీనిపై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వకపోయినా వారి హాజరును స్వాగతిస్తామని భారత కుస్తీ సమాఖ్య అధికారి ఒకరు వెల్లడించారు.

గతంలో జరిగిన 2024 పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ 50 కిలోల విభాగంలో పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన వెయింగ్ (బరువు తనిఖీ) లో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందున ఆమెపై ఒలింపిక్ అసోసియేషన్ అనర్హత వేటు వేసింది. ఈ చేదు అనుభవం తర్వాత వినేష్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించింది. ఆ తర్వాత తిరిగి డిసెంబర్ 2025లో క్రియాశీల క్రీడలలోకి వస్తున్నట్లు వెల్లడించింది. తన మూడో ఆసియా క్రీడల పతకంపై కన్నేసిన వినేష్, ట్రయల్స్ కోసం ఉదయాన్నే ఇందిరా గాంధీ స్టేడియానికి చేరుకుంది. ఆమె గతంలో 2014 ఆసియాడ్‌లో కాంస్యం, 2018 లో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
నిజానికి వినేష్ ఆసియాడ్ ట్రయల్స్‌లో పాల్గొనడానికి సుప్రీంకోర్టు కేవలం ఒక రోజు ముందే (మే 29న) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిటైర్మెంట్ ప్రకటించి తిరిగి వచ్చే క్రీడాకారులకు ఉండే 6 నెలల డోపింగ్ టెస్టింగ్ నిబంధనలను సాకుగా చూపుతూ డబ్ల్యూఎఫ్‌ఐ ఆమెను అనర్హురాలిగా పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ వినేష్ పిటిషన్ దాఖలు చేయగా.. మే 22న ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా వినేష్ వైపే నిలబడటంతో రెజ్లింగ్ సమాఖ్య దిగిరాక తప్పలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications