లివర్‌పూల్: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ కెరీర్లో దూసుకెళ్తున్నాడు. వరుసగా నాలుగో బౌట్లోనూ ప్రత్యర్థిని మట్టికరిపించాడు. పామురక్తం తాగితే తనకు ఎనలేని శక్తి వస్తుందంటూ ప్రకటించిన హంగేరీ బాక్సర్ అలెగ్జాండర్ హోర్వర్త్ సైతం అతడి పంచ్‌ల ముందు నిలవలేకపోయాడు.
తొలుత దూకుడుగా ఆట ప్రారంభించిన హోర్వర్త్ తర్వాత విజేందర్ పంచ్‌లకు తేలిపోయాడు. రెండో రౌండ్లో పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడగా.. విజేందర్ విజృంభించాడు.
గట్టిపోటీ ఇస్తాడని భావించిన 20 ఏళ్ల హోర్వర్త్.. ఏ దశలోనూ సత్తా చూపలేక పోయాడు. తొలి రౌండ్లో పెద్దగా ఉత్కంఠ లేకపోయినా విజేందర్ పంచ్‌లు హోర్వర్త్కు గట్టిగానే తగిలాయి. రెండో రౌండ్లోనూ ఇద్దరూ డిఫెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.
విజేందర్ అవకాశం కోసం ఎదురు చూస్తుండగా.. హోర్వర్త్ పంచ్‌లు కొన్ని టార్గెట్ మిస్సయ్యాయి. ఇక మూడో రౌండ్ ఆరంభంలో హోర్వర్త్ దాడి నుంచి తప్పించుకున్న విజేందర్.. అతడి భుజంపై గట్టి పంచ్ విసిరాడు. దీంతో భుజం పట్టుకుని అలెగ్జాండర్ కింద పడిపోయాడు.
నిలబడ లేకపోవడంతో రిఫెరీ కౌంట్ కూడా చేశాడు. పూర్తిగా డీలా పడ్డ హోర్వర్త్.. మళ్లీ ఫైట్ చేయడానికి నిరాకరించడంతో రిఫెరీ బౌట్‌ను నిలిపివేశాడు. విజేందర్‌ను విజేతగా ప్రకటించారు. విజేందర్కిది నాలుగో నాకౌట్ విజయం. హోర్వర్త్ను రింగ్‌లో ఎక్కువ సేపు నిలువనివ్వను అని ప్రకటించిన విజేందర్ మొత్తానికి అన్నంత పని చేశాడు.