హైదరాబాద్: మాజీ చాంపియన్, ఫెరారీ ఎఫ్-1 డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బ్రెజిల్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ వెటెల్ విజృంభించాడు. ఈ రేసులో 71 ల్యాప్‌లను వెటెల్ గంటా 31:26.262 సెకన్ల టైమింగ్‌తో ముగించి టైటిల్ విజేతగా నిలిచాడు.
జర్మనీకి చెందిన వెటెల్‌కు కెరీర్లో ఇది 47వ విజయం కాగా ఈ సీజన్లో ఐదో విజయం. 'పోల్ పొజిషన్'తో రేసును ఆరంభించిన వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్)ను తొలి మలుపు వద్ద ఓవర్టేక్ చేసిన వెటెల్ ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇక, మెర్సిడెజ్ డ్రైవర్ వాల్టెరి బొటాస్, కిమి రైకోనెన్ (ఫెరారీ) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఈ సీజన్ డ్రైవర్ చాంపియన్‌షిప్ సాధించిన లూయిస్ హామిల్టన్ (మెర్సిడెజ్) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం కావడంతో చివరి రెండు రేసులకు ప్రాధాన్యత తగ్గిపోయింది.
ఇదిలా ఉంటే భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొనగా నలుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. ఇందులో ముగ్గురు ఒకాన్ (ఫోర్స్ ఇండియా), మాగ్నుసన్ (హాస్), వాన్డూర్నీ (మెక్లారెన్) తొలి ల్యాప్‌లోనే తప్పుకోవడం విశేషం.
తాజా విజయంతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో వెటెల్‌కు 302 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. రెండు వారాల క్రితం మెక్సికో గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు (345 పాయింట్లు) ప్రపంచ టైటిల్ ఖరారైంది. ఈ సీజన్లో చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి నవంబర్ 26న జరుగనుంది.