గౌహతి: అస్సాంకు చెందిన ప్రముఖ క్రీడాకారిణి దెబోజానీ మేధిపై భౌతిక దాడి జరిగింది. మంత్రాలు, క్షుద్ర విద్యలు నేర్చుకుంటుందనే నెపంతో కొందరు ఆమెను చిత్ర హింసలకు గురి చేశారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని చేరేకులిలో చోటు చేసుకుంది.
జిల్లా ఎస్పీ బోనిల్ డియోరి కథనం ప్రకారం.. హౌరాఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన పలువురు మహిళలు తమ ఊరిలో దెయ్యం ప్రవేశించిందని, తమను కాపాడాలని నాగోన్ సమీపంలోని లంక గురువును అక్టోబర్ 10న కలిశారు. తమను ఆ దెయ్యం నుంచి కాపాడాలని కోరారు. దీంతో ఆ గురువు గ్రామంలోని ఆలయం వద్ద పదిరోజులపాటు ప్రార్థనలు చేయాలని సూచించాడు.

ఆ తర్వాత ఎవరైతే మంత్రాలు నేర్చుకుంటున్నారో వారిని తన వద్దకు తీసుకురావాలని ఆదేశించాడు. ఆ గ్రామానికి చెందిన క్రీడాకారిణి మేధి కూడా ఆలయం వద్ద ప్రార్థనలకు హాజరైంది. కాగా, ఆ ఆలయ పూజారి మేధి మంత్రాలు, క్షుద్ర విద్యలు నేర్చుకుంటుందోని ఆమెపై ఆరోపణలు చేశాడు.
దీంతో గ్రామంలోని కొందరు ఆమెపై దాడికి దిగారు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఇద్దరు మతగురువులు, వందలాది మంది భక్తుల సమక్షంలో మేధిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఇదంతా కొన్ని స్థానిక టీవీ ఛానళ్లలో కూడా ప్రసారం జరగడం గమనార్హం. కాగా, ఆమె సాయం కోసం ఎంత అర్తించినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయం.
ఘటన అనంతరం ముగ్గురు పిల్లలకు తల్లి అయిన బాధిత మహిళా క్రీడాకారిణి మేధి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
కాగా, వెటరన్ క్రీడాకారులకు జరిగే పోటీల్లో పాల్గొనాల్సిన మేధి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మేధి 2009లో హర్యానాలో జరిగిన జావేలిన్ త్రోలో బంగారు పతకం సాధించారు. ఆ తర్వాత 2010లో తమిళనాడులో జరిగిన పోటీల్లో వెండి, ఛండీఘర్‌లో 2011లో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించారు.