రియో డీ జెనిరో : బోల్ట్ రేసులో ఉన్నాడంటే.. గెలుపుపై ప్రత్యర్థులు ఆశలు వదిలేసుకోవాల్సిందేనేమో! ఒలింపిక్స్ ప్రస్తానంలో వరుసగా మూడోసారి స్వర్ణాన్ని సాధించి తన సత్తా ఏంటో చాటాడు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్. 100మీటర్ల పరుగు పందెంలో కేవలం 9.81 సెకన్లలోనే గమ్యాన్ని చేరుకున్నాడు బోల్ట్.
బోల్ట్ కు గట్టి పోటీనిస్తాడనుకున్న జస్టిన్ గ్లాటిన్ బోల్ట్ లక్ష్యాన్ని చేరుకునే సమయానికి 25మీటర్ల దూరంలో ఉండిపోయాడు. మొత్తానికి ముందే ప్రకటించినట్లు రియోలో మరోసారి చరిత్ర సృష్టించాడు బోల్ట్. తద్వారా తన పతకాల జాబితాను ఏడు పెంచుకున్నాడు. బీజీంగ్, లండన్ మహాక్రీడల్లోను 100 మీటర్ల విభాగంలో ఉసేన్ బోల్ట్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయాన్నే జరిగిన ఫైనల్లో బోల్ట్ ఈ ఘనతను సాధించాడు. గతంలో అమెరికన్ అథ్లెట్ కార్ల్ లూయిస్ ఒక్కరే ఒలింపిక్స్ లో రెండుసార్లు వంద మీటర్ల విభాగంలో స్వర్ణం కైవసం చేసుకోగా.. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ బోల్ట్ మూడోసారి ఈవెంట్ ను కైవసం చేసుకున్నాడు.
ఇక బోల్ట్ తర్వాతి స్థానాల్లో.. 9.89 సెకన్లలో పరుగును ముగించిన జస్టిన్ గ్లాటిన్ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకోగా.. కెనడా అథ్లెట్ ఆండ్రూ డీ గ్రాస్ 9.91 సెకన్లలో రేసును ముగించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.