బాధతో విలవిల్లాడాడు: విషాదంగా ముగిసిన బోల్ట్ చివరి పరుగు
హైదరాబాద్: జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కెరీర్ విషాదంగా ముగిసింది. 100 మీటర్ల పరుగు పందెంలో మూడో స్థానంతో సరిపెట్టుకున్న బోల్ట్ ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన పురుషుల 4*100 మీటర్ల రిలేలో మెప్పించలేకపోయాడు.
ఈ రేసును మెక్లీయాడ్, ఫోర్ట్, బ్లేక్, బోల్ట్‌లతో కూడిన జమైకా బృందం పూర్తి చేయలేకపోయింది. ఆఖరి అంచెలో పరుగెత్తిన బోల్ట్ గాయంతో ట్రాక్‌పై అనూహ్యంగా కుప్పకూలాడు. బాధతో విలవిల్లాడాడు. దీంతో స్వర్ణంతో కెరీర్‌కు వీడ్కోలు పలుకాలన్న బోల్ట్ ఆశలు నెరవేరలేదు.
యావత్ స్టేడియం, టీవీలలో వీక్షిస్తున్న కోట్లాదిమంది అభిమానులు ఒక్క క్షణం ఏం జరుగుతోందో తెలియక ఆందోళన చెందారు. ఈలోపు బ్రిటన్, అమెరికా, జపాన్ అథ్లెట్లు ఫినిషింగ్ లైన్ దాటేశారు. ఆద్యంతం భావోద్వేగంతో నిండిన ఈ రేసులో గ్రేట్ బ్రిటన్ 37.47 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణాన్ని ఎగురేసుకుపోయింది.
ఇక 100 మీటర్ల రేసులో బోల్ట్‌కు షాకిచ్చి స్వర్ణాన్ని ఎగురేసుకుపోయిన జస్టిన్ గాట్లిన్ సారథ్యంలోని అమెరికా జట్టు 37.52 సెకన్లతో సీజన్ బెస్ట్‌ను నమోదు చేస్తూ రజతాన్ని సొంతం చేసుకోగా జపాన్ బృందం 38.04 సెకన్లతో కాంస్య పతకం దక్కించుకుంది.
అగ్రస్థానంతో తాను కెరీర్‌ను ముగించలేకపోయానన్న బాధకన్నా కోట్లాదిమంది అభిమానులను నిరాశ పరిచానని, తన దేశానికి స్వర్ణ పతకం తేలేకపోయాన్న వేదన ఆఖరి రేసులో ఉసేన్ బోల్ట్ మొహంలో స్పష్టంగా కనిపించింది.
అసలేం జరిగింది?

ఉత్సాహంతో కనిపించిన బోల్ట్
తన ఆఖరి పరుగులో కూడా ఉసేన్ బోల్ట్ ఉత్సాహంతో కనిపించాడు. తన బృందంతో కలిసి ఒలింపిక్ స్టేడియంలోకి అడుగుపెట్టగానే వేలాది మంది అభిమానులు అతని నామస్మరణలో ఊగిపోయారు. చిరుమందహాసం చిందిస్తూనే.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ రిలే కోసం సిద్ధమయ్యాడు. ఇక అంతా అనుకున్నట్లుగానే రిఫరీ ట్రిగ్గర్ నొక్కాడు. రేసు మొదలైంది. బ్యాటన్‌తో తొలి అంచె పరుగును ప్రారంభించిన మెక్లీయాడ్ అంచనాలను అందుకున్నాడు.

అపురూప క్షణం కోసం బోల్ట్ ఎదురుచూపు
రెండో అంచెలో ఫోర్ట్ పరుగును మొదలుపెట్టాడు. మూడో అంచెలో బ్లేక్ దూసుకొస్తున్నాడు.. ఓ అపురూప క్షణం కోసం బోల్ట్ చిరుతలా ఎదురుచూస్తున్నాడు. బోల్ట్‌కు బ్యాటన్‌ను అందించి బ్లేక్ తప్పుకున్నాడు. అలా అందుకున్నాడో లేదో బోల్ట్ ఒక్కో అడుగు లంఘిస్తుంటే.. ఒకటి, రెండు, మూడు లెక్కపెట్టడానికి కూడా సమయం లేనంత వేగం.. ఆఖరి ల్యాప్‌లో ప్రత్యర్థులను ఓరకంట చూస్తూ బోల్ట్ పరుగు తీస్తున్నాడు.

స్వర్ణం ఖాయమే అనుకుంటున్న తరుణంలో
దీంతో ఇక స్వర్ణం ఖాయమే అనుకుంటున్న తరుణంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బోల్ట్ అడుగు తడబడింది. తొడ కండరాలు పట్టేసి.. బాధతో విలవిలలాడుతూ.. కుంటుతూ.. గెంతుతూ.. పరుగు ఆపేసి ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు.

ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు
అందరి దృష్టీ బోల్ట్ మీదే. ఎప్పుడూ రేసు అనంతరం నవ్వుతూ విచిత్ర విన్యాసాలు చేస్తూ సందడి చేసే బోల్ట్ తన చివరి రేసులో మాత్రం అలా ట్రాక్‌పై కూలబడిపోయి విలవిలలాడుతుంటే.. కన్నీళ్లు పెట్టుకుంటుంటే అభిమానుల గుండె బరువెక్కింది.

మైదానం నుంచి భారంగా నిష్క్రమించిన బోల్ట్
ఆ తర్వాత కొంచెం తేరుకుని లేచి నిలబడ్డ చప్పట్లతో అభినందనలు తెలుపుతున్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ భారంగా మైదానం నుంచి నిష్క్రమించాడు. బాధతో మెలికలు తిరిగిపోతున్న బోల్ట్‌ను చికిత్సకు తరలించేందుకు వైద్య సిబ్బంది వీల్ చైర్ తెచ్చారు. కానీ దానిపై వెళ్లేందుకు తిరస్కరించాడు. ట్రాక్‌పై తన ఆఖరి క్షణాలను మరింత ఆస్వాదించేందుకు అక్కడే ఉండిపోయాడు. అతడు కాలికండర గాయానికి లోనైనట్టు జమై కా టీమ్ డాక్టర్ వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications