లండన్: బ్రిటన్ భామలతో డేటింగ్ చేస్తే బట్టబయలు కావడం ఖాయమని, అందుకే వారితో డేటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని జమైకా పరుగుల వీరుడు ఉసెన్ బోల్ట్ బిబిసి రేడియోతో చెప్పాడు. బ్రిటన్ భామలతో జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు. వారి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెబుతున్నాడు.
బ్రిటన్ భామలతో డేటింగ్ చేస్తే అది బయట పడటం ఖాయమని, ఇలా చాలాసార్లు ఇబ్బంది పడ్డానని, అందుకే వారితో జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు. ఇంగ్లీష్ మహిళలను ఇష్టపడటం వల్ల పలుమార్లు ఇబ్బంది పడ్డానని, అంతా బాగానే ఉంటుందని కానీ, పొద్దున్నే విషయం పత్రికల్లో వస్తుందని, అందుకే వారికి దూరంగా ఉంటున్నానని, ప్రస్తుతం డేటింగ్ చేస్తోంది ఇంగ్లీష్ అమ్మాయితో మాత్రం కాదని చెప్పాడు.

రిటైర్ అయ్యాక కుటుంబంతో గడపడమే తన తొలి ప్రాధాన్యమని చెప్పాడు. రాజకీయాలు, కోచింగులు తనకు ఇష్టముండదని చెప్పాడు. 100మీ., 200.మీ పరుగులో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డులను వచ్చే సీజన్‌లో తిరగరాసే ప్రయత్నం చేస్తానని చెప్పాడు.
లండన్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2017లోను బరిలోకి దిగుతానని, 2016 రియో తర్వాత రిటైర్ కావాలనుకున్నప్పటికీ అభిమానులు మరోసారి ఛాంపియన్‌షిప్‌లో చూడాలన్నారని, అందుకే మరో ఏడాది కెరీర్ పొడిగించానని చెప్పాడు.
రేసులో మిగతవాళ్లను చూస్తూ పరుగెత్తడం అలవాటైపోయిందని, కేవలం తన పరుగుపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని చెప్పాడు. కాగా, 2014 గ్లాస్గో పోటీల్లో ఉసెన్ కేవలం 200 మీటర్ల పరుగు పందెంలోనే పాల్గొనే అవకాశముంది. అతను 100 మీటర్ల పరుగు పందేనికి దూరం ఉండవచ్చు.