హైదరాబాద్: జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కండరాలు పట్టేయడానికి 4*100 మీటర్ల రిలేను 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించడమే కారణమని అథ్లెట్లంతా విమర్శిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన పురుషుల 4*100 మీటర్ల రిలేలో ఆఖరి అంచెలో పరుగెత్తిన బోల్ట్ గాయంతో ట్రాక్‌పై అనూహ్యంగా కుప్పకూలి, బాధతో విలవిల్లాడిన సంగతి తెలిసిందే.
దీనిపై రేసు అనంతరం బోల్ట్ సహచర అథ్లెట్లు స్పందించారు. వాస్తవానికి ఈ పోటీ భారత కాల మానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2.20కి మొదలు కావాల్సి ఉంది. కానీ పురుషుల ఐద వేల మీటర్ల పరుగు, మహిళల హైజంప్ విజేతలకు పతకాలు ప్రదానం చేసేందుకు ఆ రేసుని నిలిపి వేశారు.
ఓ పక్కన గజగజ వణికే చలి, పోటీలో పాల్గొనే అథ్లె ట్లంతా అప్పటికే 'సూట్ల'తో సిద్ధమయ్యారు. కానీ ఎంతకీ రేసు ప్రారంభం కాలేదు. దాంతో రన్నర్లంతా దాదాపు ముప్పావుగంట అంత చలిలో వేచి చూడాల్సి వచ్చింది. దీంతో బోల్ట్ క్రీడా జీవితం ఇంత బాధాకరంగా ముగియడానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని జమైకా స్ర్పింట్ జట్టు సభ్యుడు యోహాన్‌బ్లేక్ మండిపడ్డాడు.

సుదీర్ఘ సమయం శీతల వాతావరణంలో వేచిచూడడమే బోల్ట్ గాయానికి కారణమని ఆరోపించాడు. 'వారు మమ్మల్ని ఎంతోసేపు చలిలో నిలబెట్టారు. ఇది చాలా దారుణం. స్టేడియం లోపల కూడా చాలా చలిగా ఉంది. శరీరాలను వేడిగా ఉంచేందుకు మేం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. బోల్ట్ గాయానికి విపరీతమైన చలి పరిస్థితులే కారణం. మొత్తంగా మామీద చలిదే పైచేయి అయింది' అని బ్లేక్ వ్యాఖ్యానించాడు.
తన ఆఖరి పరుగులో కూడా ఉసేన్ బోల్ట్ ఉత్సాహంతో కనిపించాడు. తన బృందంతో కలిసి ఒలింపిక్ స్టేడియంలోకి అడుగుపెట్టగానే వేలాది మంది అభిమానులు అతని నామస్మరణలో ఊగిపోయారు. చిరుమందహాసం చిందిస్తూనే.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ రిలే కోసం సిద్ధమయ్యాడు. ఇక అంతా అనుకున్నట్లుగానే రిఫరీ ట్రిగ్గర్ నొక్కాడు.
రేసు మొదలైంది. బ్యాటన్‌తో తొలి అంచె పరుగును ప్రారంభించిన మెక్లీయాడ్ అంచనాలను అందుకున్నాడు. రెండో అంచెలో ఫోర్ట్ పరుగును మొదలుపెట్టాడు. మూడో అంచెలో బ్లేక్ దూసుకొస్తున్నాడు.. ఓ అపురూప క్షణం కోసం బోల్ట్ చిరుతలా ఎదురుచూస్తున్నాడు. బోల్ట్‌కు బ్యాటన్‌ను అందించి బ్లేక్ తప్పుకున్నాడు.
అలా అందుకున్నాడో లేదో బోల్ట్ ఒక్కో అడుగు లంఘిస్తుంటే.. ఒకటి, రెండు, మూడు లెక్కపెట్టడానికి కూడా సమయం లేనంత వేగం.. ఆఖరి ల్యాప్‌లో ప్రత్యర్థులను ఓరకంట చూస్తూ బోల్ట్ పరుగు తీస్తున్నాడు. దీంతో ఇక స్వర్ణం ఖాయమే అనుకుంటున్న తరుణంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బోల్ట్ అడుగు తడబడింది. తొడ కండరాలు పట్టేసి.. బాధతో విలవిలలాడుతూ.. కుంటుతూ.. గెంతుతూ.. పరుగు ఆపేసి ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు.