హైదరాబాద్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టోర్నీలో మహిళా సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి, కెరీర్‌లో మొదటి గ్రాండ్‌స్లామ్ సాధించిన అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్స్ ఓ చిన్న పురుగుకు వణికిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే...
యుఎస్ ఓపెన్ ఫైనల్లో విజేతగా నిలిచిన స్టీఫెన్స్ అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించింది. మాట్లాడడానికి రెడీ అవుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో చిన్న పురుగు ఆమె వైపుకు వచ్చింది. దీనిని చూసి ఆమె భయపడిపోయింది.

దాని బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం, ఆ సందర్భంగా ఆమె ప్రదర్శించిన హావభావాలు నవ్వు తెప్పించాయి. ఆ పురుగు నుంచి తప్పించుకోవడానికి ఆమె మీడియా ముందే కుర్చీ నుంచి కిందకి వెళ్లడం, చివరికి తన కాలి బూటుతో పురుగుని చంపింది.
పురుగుని చంపిన తర్వాత ఆమె 'ఆ పురుగు నాకు డ్రాగన్‌లా కనిపించింది. చాలా అసహ్యంగా ఉంది' అని వ్యాఖ్యానిస్తూ తన మీడియా సమావేశాన్ని కొనసాగించింది. అయితే పురుగును చూసి ఆమె భయపడిన తీరుపై నెటిజన్లు చలోక్తులు విసిరారు.
'వేగంగా టెన్నిస్ బంతిని అడ్డుకునే నువ్వు... చిన్న పురుగుకు భయపడతావా?', 'దానికి నీ ఆట నచ్చింది. అందుకే నీ ప్రెస్‌మీట్‌లో ఎగరడానికి వచ్చింది' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు.