న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ అర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లనున్న భారత అర్చర్లకు అమెరికా షాకిచ్చింది. 20మంది సభ్యులు, కొరియా కోచ్ చియో వోమ్ లిమ్ తో సహా 30మంది కల్గిన భారత బృందానికి వీసా ఇచ్చేందుకు అమెరికా ఎంబసీ నిరాకరించింది.
భారత ఖండం నుంచి అండర్ 20 బాల, బాలికలు, జూనియర్ అర్చర్లు శనివారం అమెరికా వెళ్లాల్సి ఉంది. వారు జూన్ 8 నుంచి 14 వరకు దక్షణ డకోటాలోని యోంక్టన్‌లో జరిగే పోటీల్లో పాల్గొనాలి.
కాగా, యుఎస్ ఎంబసీ కేవలం ఏడుగురు అర్చర్లు, ఇద్దరు కోచ్‌లు, మరో భారత క్రీడాధికారికి వీసా మంజూరు చేసింది. మరో 20మంది సభ్యులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వీసా నిరాకరించింది. వీరేగాక, లిమ్ తోపాటు మరో ముగ్గురు భారత్ కోచ్‌లు మిమ్ బహదూర్ గురుంగ్, చంద్రశేఖర్ లగూరి, రామ్ అవదేశ్, సహాయకురాలు పింకీ వీసాలను కూడా నిరాకరించింది.

యుఎస్ ఎంబసీ వ్యవహారంపై అర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ట్రెజరర్ వీరేందర్ సచ్‌దేవ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారందరూ పోటీలు ముగిసిన వెంటనే తిరిగి స్వదేశానికి వెళ్లేలా లేరనే అనుమానంతో ఎంబసీ వారికి వీసా నిరాకరించినట్లు చెప్పారు.
'ఇది చాలా దిగ్ర్భాంతికి గురిచేసింది. చాలా మంది అర్చర్లు కిందిస్థాయి నుంచి వచ్చారు. వారంతా అస్సాం, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు. వారికి ఇంగ్లీష్ అంతగా రాదు. అయిత వీసా అధికారి ఎలా జీవిస్తారని ప్రశ్నించగా.. తాము అర్చర్లమని, అర్చరీ ఆడతామని వారు సమాధానం చెప్పారు' అని సచ్‌దేవ్ చెప్పారు.
ఇంగ్లీష్ రానందునే ఈ అర్చర్లకు వీసా నిరాకరించారేమోనని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే కోచ్ లిమ్ వీసాను ఎందుకు నిరాకరించారో తెలియడం లేదని అన్నారు. లిమ్ ప్రపంచంలో అనేక దేశాలు పర్యటించారని, వారికి కూడా వీసా నిరాకరించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
అమెరికా అర్చరీ అసోసియేషన్ నుంచి భారత ప్రభుత్వానికి ఆహ్వానం అందినందువల్లే తాము అమెరికా వెళ్లడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము అమెరికా వెళుతున్నామని చెప్పారు. యుఎస్ ఎంబసీ వీసా నిరాకరించడంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, క్రీడా మంత్రిత్వశాఖను సంప్రదించామని తెలిపారు.
కాగా, వీసా నిరాకరించబడిన వారు మరోసారి అప్లై చేసుకోవాలని యుఎస్ అర్చరీ అసోసియేషన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. దీంతో తామంతా మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అయితే రేపటిలోగా వీసాలు వస్తాయని తామనుకోవడం లేదని తెలిపారు. వీసాలు రాకపోతే గత మూడు నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్న అర్చర్ల శ్రమంతా వృథా అయిపోతుందని చెప్పారు.