న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ గురువారం ముంబయిలో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైంది. ఈశాన్య రాష్ట్ర అమ్మాయిని కావడం వల్లే తనపై భారత సెలక్టర్లు, రిఫరీలు వివక్ష చూపిస్తున్నారంటూ ఈ మణిపురి బాక్సర్ ఆవేదన వ్యక్తం చేసింది.
'కొన్నిసార్లు నేను తీవ్ర మనోవేదనకు గురవుతుంటా. రిఫరీలు, జడ్జీలు నాకు అనుకూల ఫలితాలివ్వరు. అయినా పట్టించుకోను. నేను ఈశాన్య రాష్ట్ర అమ్మాయినే. కానీ భారతీయురాలిని' అని ఆమె భావోద్వేగంతో చెప్పింది.

హర్యానా బాక్సర్ పింకీ జాంగ్రాకు సెలక్టర్లు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ తనపై వివక్ష చూపిస్తున్నారని మేరీ ఆరోపించింది.
'చాలా వివాదాలున్నాయి. పింకీ జాంగ్రాను నేను ఎప్పుడూ ఓడిస్తూనే ఉన్నా. ప్రతి పోటీలో స్వర్ణాలు గెలుస్తూనే ఉన్నా. అయినా, సెలక్టర్లు మాత్రం ఆమెకే మద్దతిస్తూ ఉన్నారు' అని పేర్కొంది.
అయినా సరే.. ఏదైనా రింగ్‌లోనే తానేంటో నిరూపించుకుంటానని మేరీ స్పష్టం చేసింది. కాగా, నిరుడు 51 కేజీల విభాగంలో మేరీ కోమ్ బదులు పింకీ జాంగ్రానే కామన్వెల్త్ క్రీడలకు ఎంపిక చేశారు. దీని కోసం ట్రయల్ బౌట్ నిర్వహించగా... అందులో మేరీని పింకీ ఓడించింది. ఐతే ఆ పోటీలో రిఫరీలు ఉద్దేశపూర్వకంగా తనకు వ్యతిరేకంగా పాయింట్లు ఇచ్చారని మేరీ ఆరోపించింది.