హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ విజయ పరంపరకు హర్యానా స్టీలెర్స్ అడ్డుకట్ట వేసింది. శనివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 42-36తో హర్యానా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం.
ప్రశాంత్ కుమార్ రాయ్ 14 రైడ్ పాయింట్లతో హర్యానా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ, గుజరాత్ 42 పాయింట్లతో జోన్-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు గుజరాత్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. అయితే ఆ రెండు ఓటములూ హర్యానా చేతిలోనే కావడం గమనార్హం.
బెంగాల్ Vs యుపీ మ్యాచ్ టై
బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధా 26-26తో డ్రాగా ముగించింది. తొలి అర్ధ భాగంలో వారియర్స్ 11-14తో వెనకబడింది. రెండో భాగంలో బెంగాల్ అనూహ్యంగా పుంజుకుని యూపీ యోధాను ఆలౌట్ చేసింది. చివరి నిమిషంలో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. బెంగాల్ జట్టులో మణిందర్ 8, యుపి యోధా జట్టులో నితిన్ తోమర్ 10 రైడ్ పాయింట్లు సాధించారు.