
టోక్యో: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ను అభిమానులు లేకుండానే నిర్వహించాలన్న జపాన్ ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సలహాదారు డాక్టర్ షిగెరె ఓమి సూచనను నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదు. స్థానిక అభిమానుల మధ్య గేమ్స్ నిర్వహించాలని ఒలింపిక్ నిర్వాహక కమిటీ సోమవారం నిర్ణయించింది. ప్రతి ఒలింపిక్ వేదికలో 50 శాతం సామర్థ్యం లేదా గరిష్ఠంగా 10 వేల మంది అభిమానులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. విదేశీ అభిమానులపై ఇప్పటికే ఐఓసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ, టోక్యో 2020, టోక్యో మెట్రో పాలిటిన్ ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాల విద్యార్థులతో పాటు వారి పర్యవేక్షకులను అభిమానుల కింద పరిగణించకూడదని స్పష్టం చేశారు. స్థానిక అభిమానులను అనుమతించినా.. వాళ్లకు కూడా కఠిన నిబంధనలు విధించనున్నారు. స్టేడియాల్లో అరవకూడదని, కచ్చితంగా మాస్కులు ధరించాలని, గేమ్స్ చూసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాలన్న నిబంధనలు విధించారు. ఈ గేమ్స్ కోసం మొత్తం 37 లక్షల టికెట్లు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 24న ప్రారంభం కానున్న పారాలింపిక్స్‌కు కూడా వర్తించవచ్చు.
టోక్యో ఒలింపిక్ గ్రామంలో కండోమ్‌ల పంపిణీ లేదని నిర్వాహకులు తెలిపారు. ఒలింపిక్స్ కోసం వచ్చే అథ్లెట్లకు నిర్వాహకులు కండోమ్‌లు అందజేయడం షరామామూలే. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఇలా జరిగింది. సురక్షిత శృంగారం పట్ల అవగాహన పెంచడానికి, పోటీల ఒత్తిడి నుంచి బయట పడేందుకు శృంగారంలో పాల్గొనమని ప్రోత్సహించే దిశగా ఇలా చేస్తుంటారు. అయితే ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల్లో కండోమ్‌ల పంపిణీ ఉండదని టోక్యో నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే అథ్లెట్లు తమ గదులలో మద్య పానీయాలను తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు జపాన్ వార్తా సంస్థ క్యోడోలో ఓ నివేదికలో తెలిపింది. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి.
కరోనాతో దెబ్బతిన్న దేశాల అథ్లెట్లపై జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. భారతదేశంతో సహా అనేక దేశాల అథ్లెట్లు కఠిన నిబంధనలు ఫాలో అవ్వాల్సిందే. అథ్లెట్లు జపాన్‌కు బయలుదేరే వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు వైరస్ పరీక్షలు చేసుకోవాలి. ఇక అక్కడికి చేరుకున్నాక మూడు రోజుల పాటు ఇతర జట్లతో కలవకూడదు. ఈ నిబంధనలు అథ్లెట్లకు నష్టం కలిగించనున్నాయని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఆరోపించింది. అథ్లెట్లు మూడు రోజుల పటు కీలకమైన శిక్షణా సమయాన్ని కోల్పోతారని ఐఓఏ అంటోంది.