
భోపాల్: అంతర్జాతీయ ఈవెంట్లలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు కోట్లలో నజరానా ప్రకటిస్తున్న భారత్.. అతని పట్ల దయ చూపించలేకపోతుంది. ఈ క్రమంలోనే బతుకుదెరువు కోసం.. చేసేది లేక బిచ్చగాడిగా మారాల్సిన దుస్థితి వికలాంగుడైన ఆ క్రీడాకారుడికి ఏర్పడింది. గతేడాది నిర్వహించిన స్పెషల్ ఒలింపిక్ భారత్ 100 మీటర్ల పరుగులో మధ్యప్రదేశ్‌కు చెందిన మన్మోహన్ సింగ్ లోధి రజతం సాధించాడు.
కానీ అతడికి ప్రభుత్వ ఉద్యోగం దక్కలేదు. పదేళ్ల క్రితం కుడి చేతిని కోల్పోయిన మన్మోహన్.. తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు. ఇప్పటికే పలుసార్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిశాడు. హామీ దక్కింది కానీ, ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు. సీఎం ఆదేశించినా.. అధికారులు పట్టించుకోవడం లేదని మన్మోహన్ వాపోయాడు.
ఇక ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో.. అతడు భోపాల్ వీధుల్లో బిచ్చగాడి అవతారం ఎత్తాడు. నైట్ షెల్టర్లో జీవితం వెళ్లదీస్తున్నానని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబానికి తానే ఆధారమని ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ క్రీడా శాఖాధికారుల దగ్గర ప్రస్తావిస్తే... అలాంటి అథ్లెట్ల విషయాన్ని సామాజిక న్యాయ విభాగం చూసుకుంటుందని తెలిపారు.
మధ్య ప్రదేశ్ క్రీడా ప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవాలని డిప్యూటీ డైరక్టర్ వినోద్ కోరారు. 'ప్రస్తుతం మాకు ఇలాంటి వారికి సాయం చేసేందుకు ఎటువంటి అవకాశాలు లేవు. ఇలాంటి పనులు చేయాలంటే.. ఏదైనా సామాజిక న్యాయం జరగాల్సిందే' అని పేర్కొన్నారు.