
గతేడాది భారత్‌లో 44వ చెస్ ఒలింపియాడ్ నిర్వహించారు. సుమారు 180 దేశాల నుంచి చెస్ ప్లేయర్లు భారత్‌కు వచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్లేయర్లకు, ఆయా దేశాల సిబ్బందికి ఎక్కడా ఏమీ తక్కువ కాకుండా ఒలింపియాడ్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది చూసిన ఆటగాళ్లు, సిబ్బంది అందరూ కూడా ఈ ఏర్పాట్లను తెగ మెచ్చుకున్నారు. అలాంటి ఆశలతోనే మళ్లీ దేశంలో అడుగు పెట్టిన గ్రాండ్ మాస్టర్లకు దేశ రాజధాని ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఫిడే వుమెన్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన కొందరు గ్రాండ్ మాస్టర్లు ఇక్కడి ఏర్పాట్లు ఏమాత్రం బాగలేవని ఆరోపిస్తూ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ టోర్నమెంట్ ఒక రోజు ఆలస్యంగా ప్రారంభం అవనుంది. ఢిల్లీలో అడుగు పెట్టిన తర్వాత ప్లేయర్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, తమకు దక్కుతున్న ట్రీట్‌మెంట్ చాలా చెత్తగా ఉందని ఆరోపించిన కజకస్తాన్ గ్రాండ్ మాస్టర్ ఝన్సాయా అబ్దుమాలిక్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
'ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో పరిస్థితులు, వాతావరణం చూసి నేను, నా కొలీగ్స్ షాకైపోయాం. దీనిపై కొంత చర్చించుకున్న తర్వాత ఫిడె ప్రెసిడెంట్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాం. మా అసంతృప్తిని తెలియజేయడంతోపాటు ఈ గ్రాండ్ ప్రిక్స్‌ను క్యాన్సిల్ చేయడమో లేదంటే వాయిదా వేయడమో చేయాలని ఆ లేఖలో కోరాం' అని అబ్దుమాలిక్ తన ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. ఇలా ఆమె తప్పుకోవడంతో ఒక్కసారి ఈ టోర్నమెంట్ నిర్వాహక వర్గాల్లో కలకలం రేగింది.
ఇదిలా ఉండగానే జర్మనీ గ్రాండ్ మాస్టర్ ఎలిజబెత్ పాజ్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ సైకిల్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ నిర్వహణలో చాలా లోటుపాట్లు ఉన్నాయని, అవి తనకు ఏమాత్రం నచ్చలేదని ఎలిజబెత్ మండిపడింది. 'అందరు ప్లేయర్లు ఒకే అర్హతతో టోర్నీ ప్రారంభించలేదు. ఈ అసమానతను నేను భరించలేకపోయా. కేవలం ఒక్క ప్లేయర్ కోసం ఇంత చేయడం నాకు నచ్చలేదు' అని ఎలిజబెత్ ఆరోపణలు చేసింది. ఈ టోర్నమెంట్‌లో తమ ప్లేయర్‌కు ఎదురైన పరిస్థితులపై జర్మన్ చెస్ ఫెడరేషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
'మా ప్లేయర్‌కు ఇలాంటి అనుభవం ఎదురైనందుకు జర్మన్ చెస్ ఫెడరేషన్ చాలా బాధ పడుతోంది. వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ సైకిల్‌లో జరుగుతున్న టోర్నమెంట్‌లో ఇలా జరగడం ఘోరం. కీలకమైన మహిళా టోర్నమెంట్‌లో ఇంత దారుణమైన మేనేజ్‌మెంట్ ఉంటుందని అసలు ఊహించలేదు. దీనిపై ఫిడే దృష్టి పెట్టి మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలి' అని జర్మన్ చెస్ ఫెడరేషన్ పేర్కొంది. ఈ విషయం తెలిసిన భారత చెస్ అభిమానులు.. ఈ టోర్నీ నిర్వాహకులు దేశానికే తలవంపులు తెస్తున్నారని మండిపడుతున్నారు.