హైదరాబాద్: ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగుకి తెరపడింది. లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ అభిమానులను నిరాశ పరిచాడు. దాదాపు దశాబ్ద కాలంగా 100 మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బోల్ట్ తన కెరీర్ చివరి రేసులో మాత్రం తడబడ్డాడు.
తన కెరీర్‌లో చివరి 100 మీటర్ల రేసులో తొలిసారి కాంస్యానికే పరిమితమయ్యాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 15 నిమిషాలకు లండన్ ఒలింపిక్ స్టేడియంలో 60 వేల మంది ప్రేక్షకుల నడుమ పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసు జరిగింది.

పైనల్లో డోపీగా తేలి, నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కొని ఆ తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి అడుగుపెట్టిన అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ 9.92 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణం సాధించాడు. క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా) 9.94 సెకన్లతో రెండో స్థానంలో నిలవగా, ఉసేన్ బోల్ట్ 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు.
దీంతో బోల్ట్ తన కెరీర్‌లో తొలిసారి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 'నన్ను క్షమించండి. విజయంతో ముగించలేకపోయాను. కానీ మీ అభిమానానికి కృతజ్ఞతలు' అని రేసు ముగిసిన అనంతరం బోల్ట్ చెప్పాడు. ఉసేన్ బోల్ట్ చివరి రేసు నేపథ్యంలో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.