హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగిన ఓ విషాద ఘటనలో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు హార్దిక్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాస్కెట్‌బాల్ హూప్‌పై ఒక విన్యాసం చేసే ప్రయత్నంలో పోల్ కూలి అతడిపై పడింది. స్నేహితులు హార్దిక్‌ను ఆసుపత్రికి తరలించినా అప్పటికే తీవ్ర గాయాలపాలై మరణించాడు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా క్రీడా పరికరాల పరిస్థితి, నిర్వహణలో నిర్లక్ష్యంపై దృష్టి సారించారు. నిత్యం ప్రాక్టీస్ సెషన్ జరుగుతుండగా.. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఈ జాతీయ స్థాయి ఆటగాడు హార్దిక్ మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ప్రమాదం సీసీటీవీలో రికార్డ్ అయింది. సబ్-జూనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో హర్యానాకు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్.. మంగళవారం లఖన్ మజ్రా గ్రామంలోని ఒక క్రీడా సముదాయంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ వీడియో దృశ్యాలలో అతను హూప్ వైపు దూకి, దానిని పట్టుకుని వేలాడుతూ కనిపించాడు. చాలా మంది యువ క్రీడాకారులు ఆడుకునేటప్పుడు ఇలాగే చేస్తుంటారు.

అయితే ఆ క్షణం విషాదంగా మారింది. అతను రిమ్‌ను పట్టుకోగానే.. బాస్కెట్‌బాల్ హూప్ ఐరన్ పోల్ అకస్మాత్తుగా కూలి నేరుగా అతని ఛాతీపై పడింది. తీవ్ర గాయాలపాలైన హార్దిక్‌ను కోర్టు పక్కన కూర్చున్న అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైందని.. అతను అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
పోల్ ఎందుకు కూలింది అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దానిని సరిగా అమర్చారా, తుప్పు పట్టిందా లేదా సరిగా నిర్వహించలేదా అని పరిశీలిస్తున్నారు. క్రీడా పరికరాల పరిస్థితి దర్యాప్తులో కీలకమైన భాగమని పోలీసులు వెల్లడించారు. విచారణ ముగిసిన తర్వాత బాధ్యులను గుర్తిస్తామన్నారు. స్థానిక ఎస్‌హెచ్‌వో సమర్‌జీత్ సింగ్ సంఘటనల క్రమాన్ని, ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆటగాడి మరణాన్ని ధ్రువీకరించారు. ఈ ఘటన గురించి అడిగినప్పుడు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఈ విషయంపై వ్యాఖ్యానించే ముందు పూర్తి సమాచారం సేకరిస్తానని చెప్పారు.
హార్దిక్ కేవలం ఒక విద్యార్థి మాత్రమే కాదు, దేశం గర్వించే స్థాయికి ఎదగాలని కలలు కన్న జాతీయ స్థాయి క్రీడాకారుడు. ఆనందంతో మొదలైన ప్రాక్టీస్ సెషన్ కాస్త విషాదకరంగా ముగిసింది. హర్యానాలోని క్రీడా వర్గం ఇప్పుడు ఒక భవిష్యత్తును కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయింది. శిక్షణ కోసం కోర్టుకు వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాలేకపోయాడు.