'పరుగుల రాణి'గా పేరొంది, దేశంలో ఎంతో మంది క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచిన పీటీ ఉష జన్మదినం నేడు. 1976లో కోజికోడ్‌లో జన్మించిన ఆమె.. మెరుపు వేగంతో పరుగులు తీస్తూ 1980-90 దశకాల్లో ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పింది. ఆ తరంలో ప్రపంచంలోనే వేగవంతమైన అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది.
నేటితో 59వ పడిలో అడుగు పెడుతున్న ఆమె సాధించిన రికార్డులను ఒకసారి గుర్తుచేసుకుంటే.. 1980లో ఆమె తొలిసారి మాస్కో ఒలింపిక్స్‌లో పోటీ పడింది. త్రుటిలో మెడల్ తప్పినా కూడా తన ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే ఏడాది కరాచీ ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ జరిగింది. ఈ పోటీలో ఉష చెలరేగింది.

ఏకంగా నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించిన ఔరా అనిపించింది. ఆ తర్వాత 1985లో బెస్ట్ రైల్వే అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. భారత రైల్వేస్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న తొలి భారత అథ్లెట్ ఆమెనే కావడం గమనార్హం. అదే ఏడాది జకార్తా వేదికగా జరిగిన ఆసియన్ ఛాంపియన్‌షిప్స్‌లో కూడా ఉష చెలరేగింది. ఏకంగా ఐదు బంగారు పతకాలతోపాటు ఒక కాంస్యం కూడా తన ఖాతాలో వేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ మరుసటి ఏడాది సియోల్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో కూడా నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యంతో మెరిసింది. ఇక 1989 ఆసియన్ ఛాంపియన్‌షిప్స్, 1990 ఆసియా క్రీడల్లో కలిపి నాలుగు పసిడి పతకాలు, ఐదు రజతాలు తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా 1990 ఆసియన్ గేమ్స్‌లో ఆమె మూడు సిల్వర్ పతకాలు సాధించింది. అదే ఏడాది రిటైర్‌మెంట్ ప్రకటించింది. మరుసటి ఏడాది రిటైర్‌మెంట్ వెనక్కు తీసుకొని అట్లాంటా ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె.. మరోసారి త్రుటిలో పతకం చేజార్చుకుంది.

అనంతరం ఫుకుకోవాలో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలు సాధించింది. ఆ తర్వాత 1999లో కాఠ్మండులో జరిగిన ఎస్ఏఎఫ్ గేమ్స్‌లో మరొక స్వర్ణం, రెండు రజతాలు గెలిచింది. అలాగే ఢిల్లీలో జరిగిన రాజా బలీంద్ర సింగ్ అంతర్జాతీయ అథ్లెట్ మీట్‌లో ఇంకో పసిడి పతకాన్ని ముద్దాడింది. వీటితోపాటు 1984లోనే అర్జున అవార్డు అందుకున్న ఆమె.. ఏడాది తర్వాత పద్మశ్రీ పురస్కారం దక్కించుకుంది.
తాజాగా ఇండియన్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా, అలాగే తొలి ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. ఈ పరుగుల రాణి ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఫ్యాన్స్ అంతా విషెస్ పంపుతున్నారు. మనం కూడా ఆమెకు 'హ్యాపీ బర్త్ డే' చెప్పేస్తే సరిపోతుంది.