
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్ 2020లో షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. మంగళవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో సింగ్‌రాజ్ అదానా కాంస్య పతకం గెలుపొందాడు. ఫైనల్లో అతడు 216.8 పాయింట్లు సాధించాడు. కాగా సోమవారం మహిళా షూటర్ అవని లేఖారా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తంగా సింగ్‌రాజ్ అదానా కాంస్యంతో భారత పతకాల సంఖ్య ఎనమిదికి చేరింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతదేశానికి చెందిన రుబీనా ఫ్రాన్సిస్ తుది రేసు నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో 128.5 పాయింట్లతో ఆమె ఏడో స్థానంలో నిలిచింది. కాగా ఆర్చర్ రాకేశ్ కుమార్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలయ్యాడు. వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రాకేష్ కుమార్‌ను చైనాకు చెందిన జిన్‌లియాంగ్ 145-143 తేడాతో ఓడించాడు.
అవనీ లేఖరా సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్1 ఫైనల్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఫలితంగా 19 ఏళ్ల అవనీ.. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ కూడా సోమవారం స్వర్ణం సాధించాడు. జావెలిన్ త్రోలో ఈటెను 68.55 మీటర్ల దూరం విసిరి పసిడి సొంతం చేసుకున్నాడు. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్.. ప్రపంచ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించింది. రైఫిల్ షూటింగ్‌లో అవనీ లేఖరా స్వర్ణం సాధించగా.. టీటీలో భవీనా పటేల్, మెన్స్ హైజంప్ ఈవెంట్‌లో నిషద్ కుమార్, డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేశ్ కతునియా, జావెలిన్ త్రో ఎఫ్46లో దేవేంద్ర జాజారియా, ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో పతకాలు సాధించారు. ఇక డిజేబిలిటీ క్లాసిఫికేషన్‌లో వినోద్ కుమార్ అనర్హుడిగా తేలాడు. దాంతో అతనికి దక్కిన కాంస్య పతకాన్ని పారాలింపిక్స్ 2020 నిర్వాహకులు రద్దు చేశారు.