
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత్‌కు తొలి పతకం అందించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కొదిసేపటి క్రితం స్వదేశం చేరుకున్నారు. టోక్యో నుంచి నేరుగా ఆమె ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. తన కోచ్‌తో కలిసి ఢిల్లీ వచ్చారు. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. అధికారులు, సిబ్బంది పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో విమానాశ్రయంలోనే మీరాబాయి చానుకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాల్లో కరోనా టెస్ట్ చేయడం ప్రభుత్వ నిబంధన అన్న విషయం తెలిసిందే.
విమానాశ్రయంలో భారీ సెక్యూర్టీ మధ్య మీరాబాయి చాను బయటకు వచ్చారు. ఆ సమయంలో భారత అభిమానులు కేరింతలు కొట్టారు. 'భారత్ మాతాకీ జై' అంటూ గట్టిగా నినాదాలు చేశారు. మరోవైపు 'సూపర్ వుమెన్ మీరాబాయి' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఎయిర్‌పోర్ట్ సిబ్బంది చానుకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. సోమవారం ఉదయం టోక్యోలో స్వదేశానికి ఫ్లైటెక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో కోచ్‌తో దిగిన ఫొటోను ఆమె ట్విటర్‌లో షేర్ చేసిన విషయం తెలిసిందే.
మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కిలోల పోటీల్లో మీరాబాయి చాను రజత పతకం సాధించి చరిత్ర సృష్టించారు. కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి పతకం అందించారు. 49 కిలోల పోటీల్లో చైనా అథ్లెట్ హు జిహుయి 210 కిలోలు ఎత్తి పసిడి పతకం కైవసం చేసుకున్నారు. స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోలు ఎత్తి ఘన విజయం సాధించారు. మరోవైపు మీరాబాయి స్నాచ్‌లో 87కి, క్లీన్ అండ్ జెర్క్‌లో 115కి.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి రజతం కైవసం చేసుకుంది.
అయితే కొన్ని కారణాల వల్ల హు జిహూయిని నిర్వాహకులు ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించారు. ఆమెపై డోపింగ్ ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి డోప్ పరీక్షలు చేయనున్నారని తెలిసింది. ఒకవేళ జిహూయి డోపింగ్ పరీక్షల్లో విఫలమైతే.. మీరాబాయి రజతాన్ని స్వర్ణానికి ఉన్నతీకరిస్తారు. అయితే ఈ అంశంపై మరింత సమాచారం, స్పష్టత రావాల్సి ఉంది.