
టోక్యో: క్రీడారంగంలో అత్యున్నతమైన ఈవెంట్‌గా భావించే ఒలింపిక్స్.. ప్రారంభమైంది. జపాన్ కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రతిష్ఠాత్మకమైన స్పోర్ట్స్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. జపాన్ రాజధాని టోక్యో సహా ఎంపిక చేసిన నగరాల్లో దీన్ని నిర్వహిస్తోన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులను అనుమతించట్లేదు. ప్రస్తుతం అర్చరీ ఈవెంట్ కొనసాగుతోంది. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ అర్చరీలో దీపికా కుమారి పాల్గొంటోన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి ఆమె ఎనిమిదవ స్థానంలో నిలిచారు.
కాగా- ఈ సాయంత్రం ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా- మార్చ్ పాస్ట్ నిర్వహిస్తారు. దీనికి ఏస్ బాక్సర్ మేరీకోమ్, హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యాన్ని వహిస్తారు. భారత జాతీయ పతకాన్ని జట్టును ముందుండి నడిపిస్తారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అన్ని దేశాలు మార్చ్‌పాస్ట్‌కు హాజరవుతాయి. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మొత్తం 127 మంది అథ్లెట్లు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నప్పటికీ.. వారందరూ మార్చ్‌పాస్ట్‌లో పాల్గొనట్లేదు. 20 మంది క్రీడాకారులు మాత్రమే దీనికి హాజరు కానున్నారు. ఫ్లాగ్ బేరర్స్ కాకుండా ఈవెంట్‌కు ఒకరు చొప్పున 18 మంది క్రీడాకారులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు డుమ్మా కొట్టనున్నారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుక (Tokyo Olympics Opening Ceremony)లకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమెతో పాటు పలువురు కీలక షూటర్లు కూడా దీనికి హాజరు కావట్లేదు. పీవీ సింధు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం- శనివారం ఆమె మ్యాచ్ ఆడాల్సి ఉండటమే. సుదీర్ఘ సమయంలో పాటు కొనసాగే మార్చ్‌పాస్ట్‌లో పాల్గొనడం వల్ల అలసట ఏర్పడుతుందని ఆమె భావిస్తోన్నారు. ఆ మరుసటి రోజే మ్యాచ్ ఆడాల్సి ఉన్నందున.. విశ్రాంతి తీసుకోవాలనే కారణంతో ప్రారంభ వేడుకలకు ఆమె దూరం కానున్నారు.